కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) స్పష్టం చేశారు. శనివారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణ పరిధిలోని 4వ డివిజన్ అంబటిపల్లి (Ambatpally)లో యూఐడీఎఫ్ నిధులు రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణపు పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
రోడ్డు పనుల్లో నాణ్యతపై రాజీ వద్దు..
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. డివిజన్లలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అంబటిపల్లి ప్రాంత ప్రజల చిరకాల డిమాండ్‌ను గుర్తించి అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఈ వీడీసీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు తలెత్తకుండా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజా సంక్షేమం, వార్డుల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు సమకూరుస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ అనుప ఆంజనేయులు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సిరిగిరి మురళి మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

