ఓట్ల తొలగింపుపై తెలంగాణ ‘ఇండియా’ కూటమి ఫైర్!: ఆందోళనలకు పిలుపు

కలం, వెబ్ డెస్క్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) కుమ్మక్కై దేశంలో ప్రజాస్వామ్యాన్ని ముప్పులోకి నెడుతున్నాయని తెలంగాణలోని ‘ఇండియా’ కూటమి (Telangana INDIA Bloc) నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలోని ‘ఇండియా’ కూటమి నేడు హైదరాబాద్ లో సమావేశమై కేంద్ర ఎన్నికల కమిషన్ విధానాలపై ఫైర్ అయ్యారు. కేంద్రం ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విచక్షణారహితంగా ఈడీతో పాటు సీఈసీని వాడుకుంటోందని ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన లక్షలాది మంది ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారని, ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉధృత ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నర్సింహ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఏది చెబితే కేంద్ర ఎన్నికల కమిషన్ అదే చేస్తోందని, ఇది దేశ ప్రజాస్వామ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించిందని విమర్శించారు. సోషల్ మీడియాలో మోదీకి లేదా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలను ట్యాగ్ చేసి మరీ ఓటర్ల జాబితా నుండి తొలగిస్తున్నారని ఆరోపించారు. తల్లిదండ్రుల వయసు సరిగ్గా ట్యాలీ కాలేదనే నెపంతో నోటీసులు పంపుతూ వేధిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులందరూ ఈ కుట్రను అర్థం చేసుకోవాలని, ఈ అన్యాయానికి వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనల్లో సామాన్య ప్రజలు సైతం పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

మోదీ సర్కార్ ‘సర్’ పేరుతో దేశవ్యాప్తంగా ఏకంగా 13 కోట్ల మంది ఓట్లను తొలగించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కొత్తగా ఓట్ల నమోదు కోసం ఇచ్చే ఫారమ్-6లో కఠినమైన నిబంధనలు పెడుతూ ప్రజలను ఓట్లు చేర్చుకోకుండా అడ్డుకుంటున్నారని, కొన్ని తప్పుడు ఫిర్యాదుల ఆధారంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల ఎంపిక ప్రక్రియ నుంచి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను తొలగించి, ఆ స్థానంలో కేంద్ర హోం మంత్రిని చేర్చడం ద్వారా ఎన్నికల వ్యవస్థను బీజేపీ పూర్తిగా తన గుప్పిట్లోకి తెచ్చుకుందని విమర్శలు గుప్పించారు. తొలగించిన ఓట్లలో అర్హులైన వారందరి ఓట్లను తిరిగి చేర్చాలని, నిష్పాక్షికత తప్పిన ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌(Gyanesh Kumar)ను పదవి నుండి తొలగించడమే కాకుండా ఆయనపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సీఈసీ జ్ఞానేష్ కుమార్‌‌ను అరెస్ట్ చేయాలి: మహేష్ కుమార్ గౌడ్

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, బీజేపీ ప్రయోజనాల కోసం ఈడీని విచ్చలవిడిగా వాడుతోందని.. అలాగే ఎన్నికల కమిషన్‌ను పూర్తిగా లోబరుచుకుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. కేవలం SIR ప్రక్రియ ద్వారా జరిగిన ఓట్ల తొలగింపు అక్రమాల వల్లే బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని కూటమి తీవ్రంగా నష్టపోయిందని విమర్శించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న సీఈసీ జ్ఞానేష్ కుమార్‌‌ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అంతేకాదు ‘సర్’ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలను నిరసిస్తూ ఇండియా కూటమి (Telangana INDIA Bloc) ఆధ్వర్యంలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారు. అక్టోబర్ 6వ తేదీన తెలంగాణలోని అన్ని జిల్లా హెడ్‌క్వార్టర్లలో కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి భారీ ర్యాలీలు నిర్వహించి కలెక్టరేట్ల నిర్బంధం చేపడతామని తెలిపారు. అలాగే అక్టోబర్ 8న కూటమిలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి లోక్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఈ పోరాటాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు నవంబర్ 1వ తేదీన ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని, ఈ నిరసన కార్యక్రమాలన్నింటినీ ప్రజాస్వామ్యవాదులు విజయవంతం చేయాలని కూటమి నేతలు కోరారు.

Also Read : 50 ఏళ్ల ఉచిత వైద్యం.. పేదల ప్రాణదాత డాక్టర్ రహమతుల్లాకు జాతీయ అవార్డు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>