కలం, నిజామాబాద్ బ్యూరో : గత ఎన్నికల ఓటమి పాఠాలను దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటినుంచే కొత్త వ్యూహాలు పన్నుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (BRS Nizamabad) కొత్త, వలస ముఖాలతో వెళ్లాలని భావిస్తున్నది. ఇదే పనిలో అధిష్టానం నిమగ్నం అయింది. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, వారికి టికెట్లు ఇవ్వొద్దని చర్చ జరిగినా, గత ఎన్నికల్లో వారికే టికెట్లు ఇచ్చారు. తద్వారా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.
సామాజికవర్గాల బలాబలాలను బట్టి..
నిజామాబాద్ జిల్లాలో ఈసారి మాజీ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డిని ఎమ్మెల్యేగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి దింపుతారని విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఆయన గతంలో బాల్కొండ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. కానీ ఆర్మూర్ నుంచి ఆయనను బరిలోకి దింపే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు జిల్లాలో పాత వారి స్థానంలో కొందరిని మార్చి ఎంపీగా పోటీ చేయించాలని, ఆయా చోట్ల ఇతర సామాజిక వర్గాల బలాలను బట్టి పోటీ చేయించాలని అధిష్టానం రంగం సిద్ధం చేస్తుందనే చర్చ జరుగుతున్నది. ఇదే అదనుగా కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా పక్క నియోజకవర్గాలు కావాలని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నట్టు తెలిసింది.
అంతర్గత సర్వేలతో వివరాల సేకరణ
గత ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ ఎంతోకాలంగా పోస్టుమార్టం చేస్తుండగా.. విఫలానికి ప్రధాన కారణాల్లో పాత అభ్యర్థులు, తాజా మాజీ ఎమ్మెల్యేలకు టికెట్టు ఇవ్వడం అనే వాదనను అధిష్టానం పెద్దలు గుర్తించారు. ఇక ముందుగా ఆ వైపు వద్దని దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎవరికి టికెట్టు ఎక్కడ ఇస్తే బాగుంటుంది. ఎక్కడెక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.. ఇలా అన్ని వివరాలపై అంతర్గతంగా సర్వేలు కూడా చేయిస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా అభ్యర్థులపైనే అభిప్రాయ సేకరణ చేస్తున్నదని తెలుస్తున్నది. బీఆర్ఎస్ అంతర్గత సర్వే చర్చ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది.
ఆ మూడు సెగ్మెంట్లలో మార్పులు
కామారెడ్డి జిల్లాలోనూ భారీ మార్పులు, చేర్పులు ఉంటాయని కేడర్ లో చర్చ జరుగుతుంది. గతంతో కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేసి ఓడిపోయారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడల్లో బలమైన అభ్యర్థులను అందులోనూ కొత్త ముఖాలు జనాలకు కనిపించేలా సామాజిక వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోబోతున్నారని తెలిసింది. చూడాలి ఏ నియోజక వర్గంలో ఎవరు పోటీ చేస్తారు. ఏ కొత్త ముఖం రానున్నది. ఎలాంటి సామాజిక సమీకరణాలు బలంగా మారబోతున్నాయి. ఎంత వరకూ సక్సెస్ అవుతారనేందుకు కొన్నాళ్లు వేచి చూడాలి.

