epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

స్క్రాప్ నుంచి సూపర్ బైక్.. ఇండియా స్టూడెంట్స్ ఇన్నొవేషన్ అదరహో!

కలం, వెబ్ డెస్క్:  ‘కుక్కపిల్ల, సబ్బుబిల్ల.. కాదేది కవితకు అనర్హం’ అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు అదే విధంగా ‘ఇనుప ముక్క, చెత్తకుప్ప.. కాదేది ఆవిష్కరణకు అనర్హం’ అని భారతదేశ యువ ఇంజినీర్లు అంటున్నారు. తాజాగా ఏఐ పవర్‌డ్ సూపర్ బైక్ ‘గరుడ’ ఇందుకు నిదర్శనం. పనికిరాని ఇనుప ముక్కలతో ఏఐ ఆధారిత ఎలక్ట్రిక్ సూపర్ బైక్ ‘గరుడ’ (AI-Powered Electric Bike)  అవతరించింది. ఇది భారతదేశపు తొలి ఏఐ బైక్. ఇందులో 50 శాతం స్క్రాప్‌ ఉంది. దీనిని ఏ బడా సంస్థ, పెద్దపెద్ద గూడౌన్‌లలో వందల మంది ఇంజినీర్లు కలిసి తయారు చేయలేదు. ముగ్గురు యువ ఇంజినీర్లు కలిసి సూరత్‌లోని ఒక చిన్న వర్క్‌షాప్‌లో ప్రాణం పోశారు. వ్యర్థాల బూడిద నుంచి కూడా ఆవిష్కరణలు సృష్టించవచ్చని ఈ యువ ఇంజినీర్లు నిరూపించారంటున్నారు నిపుణులు.

యువ ఇంజినీర్ల కలకు రూపం

శివమ్ మౌర్య, గూర్ప్రీత్ అరోరా, గణేష్ పాటిల్ అనే విద్యార్థులు ఏఐ ఆధారిత ఎలక్ట్రిక్ బైక్ ‘గరుడ’ను (AI-Powered Electric Bike)  రూపొందించారు. గరుడ ఒక బైక్ మాత్రమే కాదు. టెస్లా వంటి సంస్థల స్ఫూర్తితో రెండు చక్రాల వాహనాలు స్మార్ట్ పార్ట్‌నర్స్‌గా మారే భవిష్యత్తును వీరు కలగన్నారు. దానికి తమ తెలివితో ప్రాణం పోశారు.  భగవాన్ మహావీర్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు శివమ్ మౌర్య, గూర్ప్రీత్ అరోరా, గణేష్ పాటిల్. వారి ఆలోచనల ఫలితమే గరుడ. దాదాపు సంవత్సరం పాటు సాగిన కృషితో సుమారు రూ 1.8 లక్షల పెట్టుబడితో ఈ బైక్‌ను అభివృద్ధి చేశారు. భవిష్యత్తులో సెల్ఫ్ డ్రైవింగ్‌తో నడిచే స్మార్ట్ టూ-వీలర్ తయారు చేయాలనే ఆలోచన వారికి వచ్చింది. దానిని లక్ష్యంగా మార్చుకుని వారు ముందుకు సాగారు. తయారీలో 50 శాతం స్క్రాప్‌ను వినియోగించారు. ఈ స్క్రాప్ వినియోగం వారి సృజనాత్మకతను చూపడమే కాకుండా ఆటోమొబైల్ రంగంలో పర్యావరణ అనుకూల డిజైన్‌కు దారి చూపుతోంది. ఈ ‘వేస్ట్ టు బెస్ట్’ విధానం పారేసిన భాగాలను ఆధునిక వాహనంగా మార్చి పునర్వినియోగంలో ఉన్న అపార అవకాశాలను చాటుతోంది.

గరుడకు మెదడుగా ఏఐ శక్తి

రాస్ప్‌బెర్రీ-పై(Raspberry Pi) ఆధారిత ఏఐ వ్యవస్థ ‘గరుడ’కు బ్రెయిన్‌లా పనిచేస్తోంది. వాయిస్ కమాండ్లకు స్పందించడం, స్పీడ్ కంట్రోల్, అవసరమైతే తానే ఆగిపోవడం వంటి ఫీచర్లు ఈ బైక్‌లో ఉన్నాయ్. ఈ బైక్‌కు ఉన్న వైఫై ఫీచర్ బైక్, రైడర్‌తో ఒకటయ్యేలా చేస్తుంది. భవిష్యత్తు పూర్తిగా డ్రైవర్ లెస్ బైక్‌గా మారాలన్నది విద్యార్థుల లక్ష్యం. గరుడను తయారు చేసే సమయంలో భద్రత విషయంలో విద్యార్థులు రాజీ పడలేదు. భద్రతకు పెద్ద పీట వేశారు. ఈ బైక్‌లో అమర్చిన రెండు హై-రేంజ్ సెన్సార్లు నిరంతరం రహదారి పరిస్థితులను పరిశీలిస్తాయి. వాహనం 12 అడుగుల పరిధిలోకి మరొక వాహనం వస్తే గరుడ ఆటోమేటిక్‌గా స్పీడ్‌ను తగ్గిస్తుంది. మూడు అడుగుల దూరంలో అడ్డంకి కనిపిస్తే రైడర్ బ్రేక్ వేయకపోయినా “మూడు అడుగుల వద్ద ఆపు” అనే వాయిస్ కమాండ్‌తోనే బైక్ ఆగిపోతుంది. ఈ ఏఐ ఆధారిత ఫీచర్ రైడర్ భద్రతను గణనీయంగా పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గించే సామర్థ్యం కలిగి ఉంది.

స్మార్ట్ సౌకర్యాలు

రైడింగ్ అనుభూతిని మెరుగుపరచే అనేక స్మార్ట్ సౌకర్యాలు గరుడలో ఉన్నాయి. పూర్తి టచ్‌స్క్రీన్ ఇంటర్‌ఫేస్ ద్వారా జీపీఎస్ నావిగేషన్, ఫోన్ కాలింగ్, మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి సదుపాయాలు లభిస్తాయి. ముందు వెనుక కెమెరాలు ట్రాఫిక్ పరిస్థితులను స్క్రీన్‌పై ప్రత్యక్షంగా చూపించి పరిస్థితి అవగాహనను పెంచుతాయి. వైర్‌లెస్ మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉండటం వల్ల ప్రయాణంలో పరికరాలకు చార్జ్ అయిపోవడం అనే సమస్య ఉండదు.ప్రోటోటైప్ దశలోనే గరుడ పర్ఫార్మెన్స్‌లో అదరగొడుతోంది. లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే ఈ బైక్ ఈకో మోడ్‌లో 220 కిలోమీటర్లు స్పోర్ట్ మోడ్‌లో 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. కేవలం రెండు గంటల్లో బ్యాటరీ పూర్తి ఛార్జ్ అవుతుంది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ బైక్‌లతో పోలిస్తే బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. తేలికపాటి బ్యాటరీ బైక్ సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఇది ఆవిష్కరణ మాత్రమే కాదు

గరుడ ఒక ఏఐ ఆధారిత ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే కాదు. ఇది ఆవిష్కరణకు, స్టేబుల్ ఇంజినీరింగ్‌కు, భారత యువ ఇంజినీర్ల సాంకేతిక ప్రతిభకు చిహ్నం. శివమ్ మౌర్య, గుర్‌ప్రీత్ అరోరా, గణేష్ పాటిల్‌లు స్క్రాప్‌తో టెస్లా స్థాయి ఫీచర్లున్న వాహనాన్ని రూపొందించడం ఎందరో యువ ఇంజినీర్లకు ప్రేరణను ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ నేటి మొబిలిటీ సవాళ్లకు సమాధానమివ్వడమే కాకుండా యువ మేధస్సు, సాంకేతిక పురోగతికి ఎలా దారితీయగలదో ప్రపంచానికి చూపిస్తోందని నిపుణులు అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>