కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: సమాజానికి సేవలు అందిస్తున్న వారందరినీ గౌరవించుకోవడం మన సంప్రదాయం అని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ (DK Aruna) అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ గార్డెన్, ధన్వాడ మండల కేంద్రంలోని ధన్వాడ కన్వెన్షన్‌లో నిర్వహించిన అంగన్ మిలన్ సేవ (Angan Milan Seva) కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ఆశా వర్కర్ల సేవలు గుర్తించి సేవ సంకల్ప్ అభియాన్ లో భాగంగా వారందరినీ ఎంపీ డీకే అరుణ సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఆమె (DK Aruna) మాట్లాడుతూ.. 25 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ప్రజా సేవలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (PM Modi) దేశానికి ఎన్నో సేవలందించారనీ కొనియాడారు. ప్రధాని మోడీ జన్మదినం పురస్కరించుకొని నెల రోజుల పాటు.. సమాజానికి సేవలందిస్తున్న వారిని గౌరవించి, సన్మానించాలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందనీ, అందులో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సేవలు సమాజాభివృద్ధికి కీలకమని, గర్భిణీ, బాలింతలకు, చిన్నారులకు ఆప్యాయతతో, పోషకాహారాలతో కూడిన ఆహారం అందిస్తున్నారని అభినందించారు. సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆశా వర్కర్ల పాత్ర కీలకమని, గ్రామ స్వరాజ్యం సాధించాలంటే, పరిసరాల పరిశుభ్రత ముఖ్యమని ఆమె తెలిపారు.
ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగితే కుటుంబం అభివృద్ధి చెందుతుందనీ, అంగన్వాడీ టీచర్లు (Anganwadi Teachers), ఆశా వర్కర్లు (ASHA Workers), ఆయాల సేవలు అభినందనీయ మన్నారు. మహిళ సంఘాలు అందించే రుణాలు పొంది చిరు వ్యాపారాలు చేసి అభివృద్ధి సాధించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలులో మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు.
అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వికాసిత్ భారత్ లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ పని చేస్తున్నారనీ, దాంట్లో మన వంత కృషి తప్పక ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక, బీజేపీ నాయకులు రతంగ్ పాండు రెడ్డి, జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, పగడాకుల శ్రీనివాస్, బలరాం రెడ్డి, లలిత, చైర్ పర్సన్ శ్వేత, వైస్ చైర్ పర్సన్ మంజుల, ఉమేష్ ధన్వాడ సర్పంచ్ జ్యోతి రామచంద్రయ్య, ఉదయ భాను, ధన్వాడ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : ఎల్ నినో ఎఫెక్ట్.. పాలమూరులో చేపల పెంపకానికి బ్రేక్!
Follow Us On: Instagram

