కలం, జోగులాంబ గద్వాల: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TUWJ-IJU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం గద్వాల (Gadwal) పట్టణంలోని గాంధీ చౌక్‌లో గాంధీజీ విగ్రహం వద్ద ఐజేయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం (TUWJ-IJU Protest) నిర్వహించారు. బెంగళూరు ఎన్‌ఈసీ తీర్మానం ప్రకారం గాంధీ జయంతిని ‘పనిచేస్తున్న పాత్రికేయుల డిమాండ్ల దినం’గా పాటిస్తూ నిరసన తెలిపి, అనంతరం జిల్లా కలెక్టరేట్‌లో డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. సమగ్ర మీడియా కమిషన్, నూతన వేజ్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి అని, జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక కేంద్ర, రాష్ట్ర చట్టాలు తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. రద్దయిన 1955, 1958 వర్కింగ్ జర్నలిస్ట్ చట్టబద్ధమైన రక్షణలను పునరుద్ధరించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే క్యాష్‌లెస్ చికిత్స అందించేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు డిమాండ్ల పత్రాన్ని పంపించినట్లు తెలిపారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో IJU నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

