కలం, కరీంనగర్: కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాల 25 ఏళ్లు (Prathima Medical College Silver Jubilee) పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈనెల 4న నిర్వహించనున్న ‘సిల్వర్ జూబ్లీ’ వేడుకల ఏర్పాట్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రతిమ డీమ్డ్ యూనివర్శిటీ భవన నిర్మాణ పనులకుశంకుస్థాపన చేయనున్నారు.
ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన బండి సంజయ్
కేంద్ర హోంమంత్రి రాకను పురస్కరించుకుని కళాశాల ప్రాంగణంలో చేపట్టిన ఏర్పాట్లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేరుగా పరిశీలించారు. నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, ప్రతిమ యాజమాన్యం బోయినిపల్లి శ్రీనివాసరావు, చెన్నమనేని వికాస్ రావు, కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావులతో కలిసి ఆయన ఏర్పాట్లను సమీక్షించారు. హెలిప్యాడ్, పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం, డీమ్డ్ వర్శిటీ శంకుస్థాపన స్థలం, ఫోటో ఎగ్జిబిషన్, విద్యార్థుల బహిరంగ సభా ప్రాంగణాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
నాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ…
ఈ సందర్భంగా బండి సంజయ్ (Bandi Sanjay) మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిమ మెడికల్ కాలేజీ ప్రారంభ సమయంలో నాటి కేంద్ర హోంమంత్రి ఎల్.కే. అద్వానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నాటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సీహెచ్. విద్యాసాగర్ రావు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు.
సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే స్థాయిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావడం ఎంతో శుభపరిణామమన్నారు. పర్యటనలో భాగంగా అమిత్ షా పైలాన్ ఆవిష్కరించి, డీమ్డ్ యూనివర్శిటీకి శంకుస్థాపన చేస్తారని, ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారని వివరించారు.
అమిత్ షా పర్యటన వివరాలు:
ఈనెల 3 (రాత్రి 9:00 గంటలకు): హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, బేగంపేట గ్రాండ్ కాకతీయ హోటల్‌లో బస చేస్తారు.
ఈనెల 4 (ఉదయం 11:00 గంటలకు): బేగంపేట నుండి హెలికాప్టర్‌లో మెదక్ జిల్లా తూప్రాన్ చేరుకుంటారు.
ఉదయం 11:30 – మధ్యాహ్నం 2:00: తూప్రాన్‌లో ‘సబర్ డెయిరీ ప్రొడక్ట్స్ మిల్క్ ప్లాంట్’ పనులను ప్రారంభించి, స్థానిక ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో భోజనం చేస్తారు.
మధ్యాహ్నం 2:00 గంటలకు: తూప్రాన్ నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీకి చేరుకుంటారు.
మధ్యాహ్నం 2:30 – సాయంత్రం 4:30: సిల్వర్ జూబ్లీ వేడుకలు, శంకుస్థాపన కార్యక్రమాలు, ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం, విద్యార్థుల సభలో పాల్గొంటారు.
సాయంత్రం 4:30 గంటలకు: తిరిగి హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరుతారు.

