కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని గాంధీ భవన్ (Gandhi Bhavan) వద్ద పోలీసులు భారీగా మోహరించారు. GO 317 కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు (GO 317 Victims) గాంధీ భవన్కు రానున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బాధిత ఉద్యోగులు తమ సమస్యలను కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
GO 317 కారణంగా తమ స్వస్థలాలకు దూరమైన ఉపాధ్యాయులు, ఉద్యోగులను వారి అభీష్టానుసారం స్వగ్రామ జిల్లా లేదా సంబంధిత జోన్కు బదిలీ చేయాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా GO 190ను అమలు చేయడంతో పాటు బాధితుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అంతర్-స్థానిక కేడర్ ఉద్యోగులకు డిప్యుటేషన్ ప్రాతిపదికన తాత్కాలిక బదిలీలకు అవకాశం కల్పించాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయనున్నాయి. బాధితుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించి, వారి కుటుంబ పరిస్థితులు, స్థానికత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బదిలీలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
GO 317 బాధితులు (GO 317 Victims) పెద్ద సంఖ్యలో గాంధీ భవన్కు చేరుకునే అవకాశం ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గాంధీ భవన్ పరిసరాల్లో పోలీసుల మోహరింపు కనిపిస్తోంది.
Also Read : ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!
Follow Us On: X(Twitter)

