కలం, వెబ్ డెస్క్: ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో మహిళ ఆత్మహత్య (Suicide) చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్‌లోని కుషాయిగూడ (Kushaiguda) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాప్రాలోని మారుతి జూబ్లీ ఎన్‌క్లేవ్‌లో గోపాలకృష్ణ తులసీదాస్, స్వాతి మహాజన్(35) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి స్వరూప్(6) అనే కుమారుడు ఉన్నాడు. అయితే గతంలో వీరు యూకేలో నివాసం ఉండేవారు.. కాగా రెండేళ్ల క్రితం హైదరబాద్‌కు షిఫ్ట్ అయ్యారు.
గోపాలకృష్ణ ఉద్యోగం చేస్తుండగా.. స్వాతి ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంది. ఈ క్రమంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకు ఉద్యోగం దొరకలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు, నిరాశకు గురైన స్వాతి బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. ఇంటిలోని లివింగ్ హాల్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గోపాలకృష్ణ ఇంటికి వచ్చి చూడగా స్వాతి అప్పటికే మృతిచెంది ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

