మాజీ మండల అధ్యక్షులకే పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవులు..?

కలం, నిర్మల్‌ : నిర్మల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ రాజకీయాల్లో పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవుల ( PACS Chairman Posts) వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పార్టీ కష్టకాలంలో కాంగ్రెస్‌కు అండగా నిలిచి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించిన మాజీ మండల అధ్యక్షులకే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) చైర్మన్‌ పదవులు కట్టబెట్టే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

పీఏసీఎస్‌ చైర్మన్ల పదవీకాలం ముగిసినప్పటికీ, న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ప్రస్తుత చైర్మన్‌లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం పీఏసీఎస్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌, డీసీసీబీ తదితర సహకార సంస్థల చైర్మన్‌ పదవులను నామినేటెడ్‌ పద్ధతిలో భర్తీ చేసే అంశంపై కసరత్తు చేస్తున్న నేపథ్యంలో నిర్మల్‌ నియోజకవర్గంలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

మాజీ అధ్యక్షుల పేర్లే తెరపైకి..

నిర్మల్‌ నియోజకవర్గ పరిధిలోని సొసైటీలకు సంబంధించి చైర్మన్‌ పదవుల కోసం పలువురు మాజీ మండల అధ్యక్షులు, పార్టీ నాయకుల పేర్లను అధిష్టానానికి పంపినట్లు సమాచారం. దిలావర్పూర్ మండలం బన్సపల్లి సొసైటీకి తక్కల సాగర్‌రెడ్డి, సారంగాపూర్‌ మండలం కౌట్ల (బి) సొసైటీకి బొల్లోజు నర్సయ్య, ఆలూరు సొసైటీకి దశరథ్‌ రాజేశ్వర్‌, మంజులాపూర్‌ సొసైటీకినక్కల మధుకర్‌ రెడ్డి, నిర్మల్‌ రూరల్‌ మండలం ముక్తాపూర్‌ సొసైటీకి కుంట వేణుగోపాల్‌, లక్ష్మణచందా సొసైటీకి ఒడ్నాల రాజేశ్వర్‌, మామడ సొసైటీకి భుజంగ శ్రీనివాస్‌ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మండల స్థాయిలో కాంగ్రెస్‌ కార్యక్రమాలను ముందుండి నడిపిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో ఈ పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పదవుల పంపకంలో ఐకే రెడ్డికి చెక్‌?

ఇదిలా ఉండగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి వర్గానికి పీఏసీఎస్‌ పదవుల విషయంలో ప్రాధాన్యం దక్కుతుందా? లేదా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందాక ఇంద్రకరణ్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అనంతరం నియోజకవర్గంలో పార్టీ మండల అధ్యక్షుల నియామకంలో ఆయన వర్గానికి కూడా ప్రాతినిధ్యం లభించింది.

అయితే పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవులకు మాత్రం అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేసిన పాత కాంగ్రెస్‌ నాయకత్వానికే ప్రాధాన్యం ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి రావడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్న చర్చ సాగుతోంది. దీంతో ఇంద్రకరణ్‌ రెడ్డి వర్గానికి చెందిన ఆశావహుల్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

కేఎస్‌ఆర్‌ వర్గానికే ప్రాధాన్యమా?

మరోవైపు నిర్మల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇంచార్జిగా ఉన్న కూచాడి శ్రీహరి రావు వర్గానికి పీఏసీఎస్‌ పదవుల్లో అధిక ప్రాధాన్యం దక్కనుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ శ్రీహరిరావు పార్టీ కార్యక్రమాల్లో చురుగా కొనసాగుతున్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లోనూ ఆయనకు బాధ్యతలు అప్పగించడంతో పీఏసీఎస్‌ పదవుల ఎంపికలో ఆయన వర్గం ప్రతిపాదనలకు ప్రాధాన్యం లభిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

నామినేటెడ్‌ పద్ధతిలో చైర్మన్‌ పదవుల భర్తీకి ప్రభుత్వం ముందుకు వస్తే, పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం కల్పించాలన్న సూత్రం అమలైతే నిర్మల్‌ నియోజకవర్గంలోని పలు సొసైటీల్లో శ్రీహరిరావు అనుచరులకు అవకాశం దక్కే పరిస్థితి ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అధిష్టానం తుది నిర్ణయం వెలువడిన తర్వాతే ఎవరికి ఏసొసైటీ దక్కుతుందన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>