కలం , తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర పాలనలో కీలక మార్పులకు దారితీసే కోర్ అర్బన్ రీజియన్ (CURE) చట్టం (Core Urban Region Act) నేటి నుంచే అమల్లోకి రానుంది. 1955 జీహెచ్‌ఎంసీ చట్టం స్థానంలో కొత్త చట్టం అమలులోకి రావడంతో జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో ఏకీకృత పాలనా విధానం అందుబాటులోకి రానుంది.
భవన నిర్మాణ అనుమతులు, ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సులు తదితర అంశాల్లో ఒకే విధమైన నిబంధనలు అమలు కానున్నాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో అమల్లో ఉన్న రెంటల్ వాల్యూ ఆధారిత ఆస్తిపన్ను విధానానికి బదులుగా క్యాపిటల్ వాల్యూ ఆధారంగా పన్ను విధించనున్నారు. కొత్త పన్ను విధానం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
నగరంలోని ప్రతి ఆస్తికి ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ ఐడెంటిటీ కోడ్ కేటాయించి, ఆస్తిపన్ను, వాటర్, సీవరేజ్, పారిశుద్ధ్య సేవలను ఒకే వ్యవస్థతో అనుసంధానించనున్నారు. పౌర సేవల కోసం సింగిల్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అలాగే చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తుల పరిరక్షణకు హైడ్రాకు చట్టబద్ధ హోదాతో అదనపు అధికారాలు కల్పించనున్నారు. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై చర్యలకు స్పష్టమైన చట్టపరమైన అధికారాలు ఇవ్వడంతో పాటు ట్రాఫిక్, విపత్తుల నిర్వహణకు ప్రత్యేక అథారిటీల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నారు.

