కలం, వెబ్ డెస్క్ : విజయనగరం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఊహించని సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడిని (Baddukonda Appalanaidu) పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, నియోజకవర్గంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారనే తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఈ వేటు పడింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఆయనను పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది.
కాగా, జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్, పార్టీ విజయనగరం జిల్లా మాజీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (మజ్జి శ్రీను) వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి, అధికారికంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బడ్డుకొండ అప్పలనాయుడికి మజ్జి శ్రీను స్వయానా బావ, వియ్యంకుడు కావడంతో అప్పలనాయుడి వ్యవహార శైలిపై వైసీపీ అధిష్ఠానం నిఘా పెట్టింది. దీంతో నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త (ఇంఛార్జ్) బాధ్యతల నుంచి అప్పలనాయుడిని తప్పిస్తూ పార్టీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో నెల్లిమర్ల నూతన సమన్వయకర్తగా గదల సన్యాసి నాయుడికి బాధ్యతలను అప్పగించారు.
ఇంఛార్జ్ పదవి నుంచి తప్పించిన తర్వాత కూడా అప్పలనాయుడు (Baddukonda Appalanaidu) పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ, నియోజకవర్గంలో క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ వరుస పరిణామాలతో నెల్లిమర్ల నియోజకవర్గంతో పాటు విజయనగరం జిల్లా రాజకీయం ఒక్కసారిగా మరింత వేడెక్కింది. సస్పెన్షన్‌కు గురైన అప్పలనాయుడు త్వరలోనే తన వియ్యంకుడు మజ్జి శ్రీను బాటలోనే నడుస్తూ టీడీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. ఎంపీ అవినాష్‌రెడ్డికి కీలక నోటీసులు!
Follow Us On: X(Twitter)

