కలం, క్రైమ్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోనూ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. పోలీస్ జోన్లు, డివిజన్లను, పోలీస్ స్టేషన్ల పరిధులను పునర్విభజిస్తూ (Hyderabad Police Reorganisation) నిర్ణయం తీసుకున్నది. మూడు పోలీస్ డివిజన్ల పేర్లను మార్చడంతో పాటు పలు ప్రాంతాలను.. ఇతర జోన్లు, డివిజన్లు, కమిషనరేట్ల పరిధుల్లోకి బదిలీ చేసింది. మొత్తంగా 76 ప్రాంతాల పోలీస్ పరిధుల్లో మార్పులు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధాన మార్పులివే..
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ డివిజన్ పేరును శంషాబాద్ డివిజన్‌గా మార్చింది. అలాగే చిక్కడపల్లి డివిజన్‌ను కాచిగూడ డివిజన్‌గా, సంతోష్‌నగర్ డివిజన్‌ను ఛత్రినాక డివిజన్‌గా మార్చింది. మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలను మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోకి బదిలీ చేసింది. ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్ పేరును శంషాబాద్ పీస్‌గా మార్చింది. రాజేంద్రనగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మీర్పేట్ పోలీస్ పరిధుల్లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సనత్‌నగర్ ప్రాంతాల్లోని పోలీస్స్టేషన్ల పరిధులను సైతం పునర్విభజించారు. బడంగ్పేట్ పోలీస్‌స్టేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
ట్రాఫిక్ విభాగాల్లోనూ మార్పులు
శాంతిభద్రతల విభాగంతో పాటు ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థలోనూ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ (Hyderabad Police Reorganisation) చేపట్టింది. ట్రాఫిక్ జోన్లు, డివిజన్ల పరిధులను కొత్తగా ఖరారు చేసింది. మహిళల భద్రతకు సంబంధించిన ఉమెన్ సేఫ్టీ వింగ్ పరిధిలోనూ కొత్త జోన్లను ఏర్పాటు చేసింది. జోనల్ సైబర్ సెల్ పరిధులను కూడా పునర్వ్యవస్థీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో జనాభా, భౌగోళిక పరిధులు, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Also Read : నేటి నుంచే అమల్లోకి క్యూర్ చట్టం
Follow Us On: Youtube

