కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్(Nizamabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు పోలీస్ కళాబృందం (Police Cultural Team) వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. పోలీస్ సిబ్బందితో కళాబృందాన్ని ఏర్పాటు చేసి ప్రతి పల్లెలో తీవ్రతరమైన సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగం, మహిళల రక్షణ, మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది స్వార్థపరులు ప్రజల బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ కళాబృందం వినూత్న ప్రచార పద్ధతులను చేపట్టిందని అన్నారు.
పల్లెల్లో, పట్టణాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కళాబృందం పాటలు, నాటకాల రూపంలో ప్రజలను అలరిస్తూనే మోసపూరిత మానసిక దోపిడీ నుంచి ప్రజలను కాపాడే సందేశాన్ని అందిస్తోంది. డ్రగ్స్, ప్రమాదాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళల రక్షణ కోసం అమలులో ఉన్న కొత్త చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 106 అవగాహన కార్యక్రమాలను నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య వెల్లడించారు. సమాజంలో తప్పులు, నేరాలు జరుగకుండా ముందస్తుగా ప్రజల్లో పాటలు, నాటకాల రూపంలో చైతన్యం కల్పించడమే పోలీస్ కళాబృందం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అన్ని గ్రామాల్లో కళాబృందం ప్రదర్శనలకు మంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే తమ ప్రధాన కర్తవ్యమని, సామాజిక అంశాలు, చట్టాలు, హక్కులపై పలువురికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నూతన పద్ధతుల్లో ప్రజల్లోకి వెళ్లి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సీపీ సాయి చైతన్య వెల్లడించారు.

