కలం వెబ్ డెస్క్ : మెక్సికో దేశాన్ని శుక్రవారం భారీ భూకంపం (Mexico Earthquake) వణికించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.5గా నమోదైంది. దీని కేంద్రం పసిఫిక్ తీరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అకాపుల్కోకు దగ్గరలో ఉన్న సాన్ మార్కోస్ పట్టణం సమీపంలో ఉంది. మెక్సికో జాతీయ సీస్మాలజీ సంస్థ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించింది. భూకంపం ప్రభావంతో అకాపుల్కో, మెక్సికో సిటీలో నివాసితులు, పర్యాటకులు భయభ్రాంతులకు గురై రోడ్లపైకి పరుగులు తీశారు. అదే సమయంలో దేశ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ మీడియా సమావేశంలో ఉండగా ఈ కార్యక్రమానికి కొద్దిసేపు అంతరాయం కలిగింది.
గెర్రెరో (Guerrero) రాష్ట్రంలో భూకంప కేంద్రం సమీపంలో ఒక 50 ఏళ్ల మహిళ ఇల్లు కూలిపోవడంతో మరణించింది. మరోవైపు మెక్సికో సిటీలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం ఇద్దరు మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. అకాపుల్కో చుట్టుపక్కల రహదారులపై చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. గెర్రెరో రాజధాని చిల్పాన్సింగోలోని ఒక ఆసుపత్రి బిల్డింగ్ తీవ్రంగా దెబ్బతిన్నది. దాంతో రోగుల్ని బయటకు తరలించారు. భూకంపం తర్వాత 500కు పైగా ఆఫ్టర్ షాక్స్ నమోదయ్యాయి. మొత్తంగా పెద్ద ఎత్తున నష్టం జరగలేదని, కొన్ని చోట్ల నిర్మాణాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also: ఆయుధాలు లోడ్ చేసి పెట్టాం.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Follow Us On: Youtube


