కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల (Asian Games) గ్రీకో-రోమన్ రెజ్లింగ్‌లో భారత్‌కు రజత పతకం దక్కింది. గురువారం జరిగిన పురుషుల 97 కేజీల విభాగం ఫైనల్లో భారత రెజ్లర్ నితీష్ సివాచ్ (Nitesh Siwach) ఓటమి పాలై వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. ఆరంభం నుంచే స్థానిక ఫేవరెట్, జపాన్ ఆటగాడు యూరి నకజాటో నితీష్‌పై ఒత్తిడి పెంచాడు. నితీష్ పట్టు సాధించడానికి ప్రయత్నించినా, జపనీస్ రెజ్లర్ అతనికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.తొలి రౌండ్‌లోనే నితీష్‌ను మ్యాట్ వెలుపలికి నెట్టి నకజాటో తొలి పాయింట్ సాధించాడు. ఆ తర్వాత పాసివిటీ కారణంగా నితీష్ కింద పడే స్థితికి వెళ్లినా, ప్రత్యర్థికి పాయింట్లు ఇవ్వకుండా చక్కగా డిఫెండ్ చేసుకున్నాడు.
మొదటి రౌండ్ ముగిసేసరికి నకజాటో 2-0 ఆధిక్యంలో నిలిచాడు. రెండో రౌండ్‌లో నకజాటో మరింత విరుచుకుపడి నితీష్‌ను టేక్‌డౌన్ చేసి ఆధిక్యాన్ని 4-0కి పెంచుకున్నాడు. చివరి నిమిషంలో నితీష్ పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయాడు. దాంతో నకజాటో 4-0తో విజయం సాధించి స్వర్ణం గెలవగా, నితీష్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఓటమితో గ్రీకో-రోమన్ విభాగంలో ఆసియా గేమ్స్ (Asian Games) స్వర్ణ పతకం కోసం భారత్ చేస్తున్న సుదీర్ఘ నిరీక్షణ కొనసాగుతోంది. 1962 జకార్తా ఆసియాడ్‌లో మాల్వా సింగ్, గణపత్ అందాల్కర్ చివరిసారిగా భారత్‌కు ఈ విభాగంలో గోల్డ్ మెడల్స్ అందించారు.
Also Read : పాక్‌పై భారత్ థ్రిల్లింగ్ విజయం
Follow Us On: X(Twitter)

