కలం, నిర్మల్: అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో న్యాయ సహాయ క్లినిక్ (Legal Aid Clinic), పెన్షనర్ల భవనంలో వైద్య శిబిరాన్ని గురువారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ వాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులకు కుమారులు సరైన పోషణ, ఆర్థిక సహాయం అందించకపోతే న్యాయ సహాయ క్లినిక్‌లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ఫిర్యాదుపై 90 రోజుల్లో విచారణ చేపట్టి నెలకు రూ.10 వేల వరకు మెయింటెనెన్స్ అందేలా ఆర్డీఓ ద్వారా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. వృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరణ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

