కలం, వెబ్ డెస్క్ : బెంగళూరులోని (Bengaluru) కగ్గదాసపురలో గ్యాస్ సిలిండర్లు వరుసగా పేలడంతో ఉదయం తీవ్ర కలకలం నెలకొంది. మల్లేశ్‌పాళ్య 6వ క్రాస్‌లోని ఓ ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 10.30 నుంచి 10.45 గంటల మధ్య మూడు ఎల్పీజీ సిలిండర్లు వరుసగా పేలినట్లు (LPG Cylinders Explode) పోలీసులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు.
షెడ్డులో భారీగా సిలిండర్ల నిల్వ
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో షెడ్డులో సుమారు 50 వరకు ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. వీటిలో కమర్షియల్, డొమెస్టిక్ సిలిండర్లతో పాటు 3 నుంచి 5 కిలోల సామర్థ్యం కలిగిన మినీ సిలిండర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా సిలిండర్లను నిల్వ చేసి, అక్కడే అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ నిర్వహిస్తున్నారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్ సమీపంలో పేలుళ్లతో ఆందోళన
పేలుళ్లు సంభవించిన ప్రాంతానికి సమీపంలో ఎన్‌సీఎఫ్‌ఈ స్కూల్, అటల్ బిహారీ వాజ్‌పేయి పార్క్‌తో పాటు ఓ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఘటన జరిగిన సమయంలో పాఠశాలలో తరగతులు కొనసాగుతున్నాయి. పేలుళ్ల ధాటికి, వేడి ప్రభావంతో స్కూల్‌లోని కొన్ని కిటికీ అద్దాలు దెబ్బతిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో విద్యార్థులు, సిబ్బంది భద్రతపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమైంది.
సమాచారం అందుకున్న బయ్యప్పనహళ్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. సిలిండర్లు ఎవరు అక్కడికి తీసుకొచ్చారు? వాటిని నిల్వ చేయడానికి అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

