నిర్మల్ రాజకీయాల్లో కొత్త ముఖం.. యువనేత ఎంట్రీపై ఆసక్తికర చర్చ!

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) నియోజకవర్గ రాజకీయాల్లో మరో కొత్త ముఖం తెరపైకి రాబోతుందా..? ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతల మధ్య సాగుతున్న పోరుకు తోడు ఓ యువ నాయకుడు రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నారా..? ప్రస్తుతం నిర్మల్ రాజకీయ వర్గాల్లో ఇదే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని పలువురు సీనియర్‌ నాయకులను యువ నేత కలుస్తుండటం ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తోంది. నిర్మల్ నియోజకవర్గ రాజకీయాలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన పలువురు నేతలు ప్రజల ఆదరణతో ఎమ్మెల్యేలుగా గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. దీంతో నిర్మల్‌ రాజకీయాల్లోకి కొత్త ముఖం ప్రవేశించనుందన్న ప్రచారం సహజంగానే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కొత్తవారికి కలిసొచ్చిన నిర్మల్‌ రాజకీయం..

నిర్మల్‌ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. 1962 నుంచి వరుసగా మూడుసార్లు పి. నర్సారెడ్డి విజయం సాధించారు. 1962, 1967, 1972 ఎన్నికల్లో గెలిచిన ఆయన అనంతరం పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు మంత్రివర్గాల్లో పనిచేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన అయిండ్ల భీంరెడ్డి డిప్యూటీ స్పీకర్‌, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అదేవిధంగా వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్‌ సముద్రాల వేణుగోపాలచారి 1985, 1989, 1994 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2008లో సినీ హీరో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఇప్పటి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ పరిణామాలను పరిశీలిస్తే నిర్మల్‌ నియోజకవర్గం కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి.

సీనియర్లతో వరుస భేటీలు..

తాజాగా రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న యువ నేత నల్ల వినయ్‌రెడ్డి (Nalla Vinay Reddy) ఇప్పటికే నిర్మల్ రాజకీయాల్లో గతంలో కీలకంగా పనిచేసిన పలువురు సీనియర్‌ నాయకులను కలుస్తున్నట్లు సమాచారం. వారి రాజకీయ అనుభవాలను తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గ పరిస్థితులు, సామాజిక సమీకరణాలు, ప్రజా సమస్యలపై చర్చిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అన్ని మండలాల్లో పరిచయాలు..

లక్ష్మణచందా మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన నల్ల వినయ్‌ రెడ్డి (Nalla Vinay Reddy) హైదరాబాద్‌లో పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తన పరిచయస్తులు, అనుచరులతో మమేకమవుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో పరిచయాలు పెంచుకునే దిశగా ఆయన ప్రయత్నాలు సాగుతున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

అక్టోబర్‌లో ప్రధాన పార్టీలో చేరిక?

దసరా పండుగ అనంతరం ఓ ప్రధాన రాజకీయ పార్టీలో చేరేందుకు నల్ల వినయ్‌రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారన్న అంశంపై చర్చ జరుగుతోంది. యువ నేత రాజకీయ అరంగేట్రం చేస్తే నిర్మల్‌ నియోజకవర్గంలో ఆయనకు లభించే స్పందన ఎలా ఉంటుంది, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఆయన ఎంట్రీ ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read : రాజీనామా చేసేవరకు వదలబోం: అభిజిత్ దీప్కే

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>