కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ (Telangana Cabinet) భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2027 నిర్వహణపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించనుంది. అలాగే రాజధానిలో ప్రజారవాణాను విస్తరించే క్రమంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అంశంపై ప్రాథమిక స్పష్టత రానుంది. దీనితో పాటు మెట్రో ఫేజ్-2 విస్తరణ, దానికి అయ్యే అంచనా వ్యయం, కేంద్ర ప్రభుత్వ వాటా, నిధుల సమీకరణ మార్గాలపై కేబినెట్‌లో విశ్లేషించనున్నారు.
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు ఫేజ్-1 పనుల వేగవంతం, దానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ, బాధితులకు పునరావాసం కల్పించే విధానంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో రవాణా రంగాన్ని మలుపు తిప్పే రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర, దక్షిణ భాగాల నిర్మాణం, పెండింగ్ అనుమతులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, భూసేకరణ పురోగతిని సమీక్షించనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏల (DA) మంజూరు, పీఆర్‌సీ (PRC) కమిషన్ సిఫార్సులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కేబినెట్ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. యువతకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే రాజీవ్ యువ వికాసం పథకం విధివిధానాలను ఖరారు చేయడంతో పాటు, ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించే తేదీని కూడా ప్రకటించనున్నారు.

