అక్టోబర్​ 1న జర్నలిస్టులకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : విధి నిర్వహణలో నిరంతరం ఒత్తిడికి గురవుతున్న జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఎస్‌వీఎస్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ (Free Mega Health Camp) నిర్వహిస్తున్నట్లు పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్, మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్ చారి తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు ఎస్‌వీఎస్ ఆసుపత్రి , మెడికల్ కాలేజీలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

బుధవారం మహబూబ్‌నగర్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జర్నలిస్టులు ఏడాది పొడవునా 24/7 విధి నిర్వహణలో ఉంటూ వృత్తిపరమైన ఒత్తిడి, సమయపాలన లేకపోవడం, మారుతున్న పని పరిస్థితులు తదితర కారణాలతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను ముందుగానే గుర్తించకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో పరిస్థితి తీవ్రంగా మారుతోందన్నారు.

సహచర జర్నలిస్టులు ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్న ఘటనలు జర్నలిస్టులు, వారి కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ముందస్తు వైద్య పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

యెన్నం చొరవతో సంక్షేమ సంఘం ఏర్పాటు

పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఏర్పాటుకు దారితీసిన పరిణామాలను ఈ సందర్భంగా వాకిట అశోక్ కుమార్ వివరించారు. గతంలో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పాలమూరు ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సీనియర్ జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో జర్నలిస్టులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

సతీమణులకూ ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్

పాలమూరు వర్కింగ్ జర్నలిస్టులకు వైద్య, ఆరోగ్య, రక్త, గుండె సంబంధిత పరీక్షలు ఉచితంగా నిర్వహించాలని ఎస్‌వీఎస్ ఆసుపత్రి & మెడికల్ కాలేజీ యాజమాన్యాన్ని కోరగా సానుకూలంగా స్పందించిందని వాకిట అశోక్ కుమార్, నరేందర్ చారి తెలిపారు. జర్నలిస్టులతో పాటు వారి సతీమణులకు కూడా ఉచిత మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించేందుకు ఆసుపత్రి యాజమాన్యం ముందుకొచ్చిందన్నారు.

బీపీ, షుగర్, ఈసీజీ, రక్త పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలతో పాటు వైద్యుల సూచన మేరకు అవసరమైన ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ వైద్య పరీక్షలను రెండు విడతలుగా మొత్తం 12 రోజులపాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

మొదటి విడతలో 45 సంవత్సరాలు పైబడిన జర్నలిస్టులు, వారి సతీమణులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. రెండో విడతలో 20 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల జర్నలిస్టులు, వారి సతీమణులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ 20 మంది జర్నలిస్టులు, వారి సతీమణులు 20 మంది చొప్పున మొత్తం 40 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

యూనియన్లు, సంఘాలకు అతీతంగా అందరి ఆరోగ్యమే లక్ష్యం

జర్నలిస్టుల ఆరోగ్యం, వారి కుటుంబాల సంక్షేమం విషయంలో యూనియన్లు, సంఘాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని వాకిట అశోక్ కుమార్, నరేందర్ చారి పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని జర్నలిస్టు యూనియన్లు, సంఘాల ప్రతినిధులు సహకరించి, అర్హులైన జర్నలిస్టులు ఉచిత వైద్య పరీక్షల్లో భాగస్వాములు అయ్యేలా ప్రోత్సహించాలని కోరారు. ఆయా యూనియన్లు, సంఘాల పరిధిలోని అర్హులైన జర్నలిస్టుల జాబితాలను అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ (Free Mega Health Camp)ను విజయవంతం చేయాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాలమూరు సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు సతీష్ కుమార్, పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు కేశవులు, సీనియర్ పాత్రికేయులు ఉర్దూ జర్నలిస్టు ఫోరం ప్రతినిధులు తకీ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>