కలం, వెబ్ డెస్క్: సిరిసిల్ల బహిరంగ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ గడిపై గురిపెట్టి.. ఫిరంగుల్లా పేలుదామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గడిని నేలమట్టం చేద్దామని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన కావాలా.. దొరల గడీల పాలన కావాలా? అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు రూ.వేల కోట్లు సంపాదించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. ఎవరేం అభివృద్ధి చేశారో చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దళితుడైన స్పీకర్‌ను అధ్యక్షా అని అనాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని ఆరోపించారు. 2009 నుంచి ఆరుసార్లు జరిగిన ఎన్నికల్లో కేటీఆర్‌ను సిరిసిల్ల ప్రజలు గెలిపించారని.. నేతన్నల ఆత్మహత్యలను ఆయన ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. గల్ఫ్‌కు వలసపోతున్న కార్మికులను కేటీఆర్ ఎందుకు ఆపలేకపోయారని నిలదీశారు. ‘పిల్ల కాకికి ఏం తెలుసు ఉండేలు దెబ్బ.. నీ అయ్య కేసీఆర్‌కు తెలుసు రేవంత్ రెడ్డి దెబ్బ’ అంటూ కేటీఆర్‌పై మండిపడ్డారు.

