కలం, మహబూబ్ నగర్ బ్యూరో : భవిష్యత్తులో వైద్యులుగా చలామణి అయ్యేవారు అత్యుత్తమ విలువలతో సమాజానికి సేవ చేయడానికి ముందు ఉండాలని జిల్లా ఎస్పీ డి.జానకి (Mahabubnagar SP Janaki) పిలుపునిచ్చారు. బుధవారం ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, భవిష్యత్తులో సమాజానికి సేవ చేయబోయే వైద్యులు కాబట్టి క్రమశిక్షణ, మానవతా విలువలు, బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చుకోవాలి అని సూచించారు.
ప్రతి సీనియర్–జూనియర్ మధ్య జరిగే పరిచయాన్ని ర్యాగింగ్‌గా భావించాల్సిన అవసరం లేదని, అయితే ఒక విద్యార్థిని అవమానించడం, భయపెట్టడం, మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టడం, గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం మాత్రం ర్యాగింగ్ పరిధిలోకి వస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. అదే విధంగా ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే భయపడకుండా కళాశాల యాజమాన్యానికి లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఎస్పీ (Mahabubnagar SP Janaki) సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల ఆరోగ్యం, చదువు, కుటుంబం మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ఎవరైనా డ్రగ్స్ వినియోగించడం, విక్రయించడం లేదా సరఫరా చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విద్యార్థులు స్వయంగా డ్రగ్స్‌కు దూరంగా ఉండటంతో పాటు తమ స్నేహితులు కూడా వాటి బారిన పడకుండా చైతన్యం కల్పించాలని కోరారు.
‘ర్యాగింగ్‌కు దూరంగా ఉండండి.. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి’ ఎస్పీ జానకి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల డైరెక్టర్ డాక్టర్ రమేష్, అకడమిక్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిరణ్మయి, అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్ నెహ్రూ, ఎన్ఎంసీ సమన్వయకర్త డాక్టర్ శ్రీకాంత్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య, మహబూబ్ నగర్ రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

