కలం, వెబ్‌డెస్క్: దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం ప్రమాదకరంగా మారుతోందని, చదువుకున్న వ్యక్తులే సమాజానికి చెడు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో శుక్రవారం జరిగిన భూపాల్ నోబెల్స్ యూనివర్సిటీ 104వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. నిరుడు నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడును ప్రస్తావించిన ఆయన, ఆ ఘటనలో నిందితులు డాక్టర్లేనని గుర్తుచేశారు. ‘ప్రిస్కిప్షన్లపై ‘ఆర్ఎక్స్’ అని రాసే డాక్టర్ల చేతుల్లో ఆర్డీఎక్స్ ఉండడం ఎంత ప్రమాదకరమో ఢిల్లీ దుర్ఘటన చెబుతోంది’ అని ఆయన అన్నారు.
చదువు లక్ష్యం కేవలం వృత్తిపరమైన విజయానికే పరిమితం కాకూడదని, సమాజంలో నైతికత, విలువలు, మానవత్వం పెంచడానికి కూడా తోడ్పడాలని పేర్కొన్నారు. జ్ఞానంతోపాటు వినయం, మంచి స్వభావం, విలువలు నేర్పని చదువు రాణించదని చెప్పారు. కాగా, ఢిల్లీ దుర్ఘటనలో బాంబు అమర్చిన కారును నడిపిన నిందితుడు ఉమర్ నబీ డాక్టర్. ఈ ఘటనలో మరో ముగ్గురు డాక్టర్లు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనతో వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ బయటపడింది.
Read Also: మరోసారి వివాదంలో గ్రోక్.. కేంద్రం ఆగ్రహం
Follow Us On : WhatsApp


