కలం, హనుమకొండ: వరంగల్–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. హనుమకొండలోని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొని ఓటరు నమోదు కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హత కలిగిన పట్టభద్రులందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని నాయకులకు సూచించారు. ప్రతి డివిజన్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారికి ఓటరు నమోదు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
ఓటరు నమోదుకు ప్రత్యేక ప్రాధాన్యత..
దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vinay Bhaskar) మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని అన్నారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించే విధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి పట్టభద్రులకు ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని నివృత్తి చేస్తూ, అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు.
పార్టీ నాయకులు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని, ప్రతి అర్హుడిని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పట్టభద్రుల సమస్యలు, వారి హక్కులు, ప్రజాస్వామ్య ప్రక్రియలో వారి భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా విస్తృతంగా అవగాహన కల్పించాలని నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, మాజీ డివిజన్ ప్రెసిడెంట్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగ నాటకాలను తిప్పికొడతాం: బండి సంజయ్
Follow Us On: X(Twitter)

