కలం, నల్గొండ : తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) కారు ప్రమాద ఘటనపై డీజీపీ స్థాయి అధికారితో కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని టీఆర్పీ జిల్లా అధ్యక్షులు వైద్యం వెంకటేశ్వర్లు కోరారు. టీఆర్పీ, బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం క్లాక్ టవర్ సెంటర్ లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు వైద్యం వెంకటేశ్వర్లు, పలువురు బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రమాద ఘటనపై నిష్పక్షపాతంగా డీజీపీ స్థాయి అధికారితో సమగ్ర విచారణ జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనలో కుట్ర కోణాన్ని నిగ్గు తేల్చి దోషులు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులైనా పక్షపాతం లేకుండా క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర పూర్తయ్యే వరకు పోలీస్ శాఖ ద్వారా పూర్తిస్థాయి భద్రత కల్పించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్లన్నపై ఈగ వాలినా బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ ఘటన వివరాలను పరిశీలించి మల్లన్నకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలన్నారు.
ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడి చికిత్స పొందుతూ మహిళ మరణించడం దురదృష్టకరమని నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన మహిళ కుటుంబానికి తక్షణమే ఒక కోటి రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్, టీఆర్పీ పట్టణ అధ్యక్షులు చిలకరాజు సతీష్ కుమార్, టీఆర్పీ నాయకులు కొమ్మనపల్లి ముత్తయ్య, జెర్రిపోతుల రమేష్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు వెంకట నరసయ్య, ఇంద్రయ్య, చిలకరా చెన్నయ్య, పుట్ట వెంకన్న, బక్కతట్ల వెంకన్న, కర్నాటి యాదగిరి, కల్లూరి సత్యనారాయణ గౌడ్, జనిగా లింగస్వామి యాదవ్, మల్లెబోయిన సతీష్ యాదవ్, దామనూరి శీను, జంజిరాల శేఖర్, ఊళ్లేందుల అంజయ్య, పగిళ్ల వెంకన్న, చర్లపల్లి మల్లేష్, గడ్డం మారయ్య తదితరులు పాల్గొన్నారు.

