కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ (Narayankhed) మండలం చాప్ట(కె) గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నపిల్లల ఆదరణ కరువై, మనస్తాపానికి గురైన ఓ వృద్ధ దంపతులు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చాప్ట(కె) గ్రామానికి చెందిన నర్సిరెడ్డి (75), అంజమ్మ (70) దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే, వయోభారంతో ఉన్న తమను కుమారులు సరిగా పట్టించుకోకపోవడంతో వీరు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. తమను పోషించడం లేదని, ఆదరించడం లేదని గతంలోనే బాధితులు పోలీసులను కూడా ఆశ్రయించి, తమ ముగ్గురు కుమారులపై ఫిర్యాదు చేశారు.
అయినప్పటికీ పిల్లల ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు.. గ్రామీణ శివారులోని తమ సొంత వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇది ఆత్మహత్యా? లేక వేరే ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో చాప్ట(కె) గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
Also Read : కరువు.. కరెంట్ కష్టాలతో రైతాంగం ఉక్కిరిబిక్కిరి!
Follow Us On: X(Twitter)

