​కరీంనగర్ కలెక్టరేట్‌ పేదవాడికి నమ్మకం కల్పించాలి: సీఎం రేవంత్

కలం, కరీంనగర్ బ్యూరో: నవ నిర్మిత కరీంనగర్ కలెక్టరేట్ (Karimnagar Collectorate) సముదాయం కేవలం ఒక భవనం మాత్రమే కాదని.. అది ప్రతి పేదవాడికి ప్రభుత్వంపై నమ్మకాన్ని కలిగించే విశ్వాస కేంద్రంగా మారాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పిలుపునిచ్చారు. కరీంనగర్ నూతన కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమగ్ర సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చాలా కాలంగా పెండింగ్‌‌లో ఉన్న ఈ సమగ్ర జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మాణాన్ని ప్రజా ప్రభుత్వం వేగవంతం చేసి పూర్తి చేసిందని సీఎం తెలిపారు. ​

​ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలోని చివరి పేదవాడికి చేరవేసే కీలక ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులే. అధికారుల వద్దకు నిస్సహాయంగా, ఆశగా సహాయం కోసం వచ్చే సామాన్య ప్రజల్లో మన కుటుంబ సభ్యులను చూసుకున్నప్పుడే వారికి శాతానికి నూరు శాతం పూర్తి న్యాయం జరుగుతుంది. మీరంతా కష్టపడి పనిచేస్తేనే పేదలకు సరైన న్యాయం అందుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, దేశ ప్రధానమంత్రికైనా మంచి పేరు రావాలన్నా, పాలన విజయవంతం కావాలన్నా అది ఉద్యోగుల ప్రతిభ, సహకారంపైనే ఆధారపడి ఉంటుంది” అని వ్యాఖ్యానించారు.

​ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలనే ఆలోచనతోనే ఈ నూతన భవన సముదాయ నిర్మాణాన్ని పూర్తి చేశామని చెప్పారు. “మనం ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూనే, మీ సమస్యలను కూడా క్రమంగా పరిష్కరించుకుందాం. అప్పుడే పాలనపై, మనపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుంది” అని సీఎం వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ‘ఇచ్చి పుచ్చుకునే ధోరణి’

​రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. “వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించినా, కేంద్రం నుండి సరైన అనుమతులు రాకపోతే ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే కేంద్ర ప్రభుత్వంతో ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్తున్నాం. మా ఢిల్లీ పర్యటనలపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం లెక్కలు వేస్తున్నారు. కానీ రాష్ట్ర సమస్యలు, నిధులు, అనుమతుల కోసం ఎన్నిసార్లైనా కేంద్రాన్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.

​గతంలో ఎన్నడూ లేనివిధంగా కేవలం ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే 170 ఎకరాల డిఫెన్స్ భూములను రాష్ట్ర అభివృద్ధి పనుల కోసం బదిలీ అయ్యేలా కేంద్రంతో చర్చించి ఒప్పించామని సీఎం గుర్తుచేశారు. అంతేకాకుండా బేగంపేట రన్ వే కింద నుంచి ట్రాఫిక్ సమస్య నివారణకు రోడ్డు నిర్మించుకునేందుకు అనుమతులు సాధించామని తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు. ​కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధిపై త్వరలోనే మరొకసారి పూర్తిస్థాయి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

Also Read : కలెక్టరేట్ వేదికగా రేవంత్ .. బండి సంజయ్ విభేదాల రచ్చ!

​Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>