కలం, హైదరాబాద్ : సైబర్ దాడులు కేవలం హానికర సాఫ్ట్‌వేర్, వైరస్‌లు, సాంకేతిక లోపాల ద్వారానే జరగడం లేదని, ఫోన్ కాల్, మెసేజ్, పరిచయ వ్యక్తి పేరుతో చేసే మోసం, క్లోన్ చేసిన గొంతు, ఏఐతో రూపొందించిన నకిలీ కంటెంట్ ద్వారా కూడా జరుగుతున్నాయని సైబర్ భద్రత (Cyber Security) నిపుణులు హెచ్చరించారు. సైబర్ భద్రతను కేవలం ఐటీ అంశంగా చూడకుండా.. విశ్వాసం, మానవ ప్రవర్తన, విచక్షణకు సంబంధించిన అంశంగా గుర్తించాలని సూచించారు.
సైబర్ భద్రతపై నిర్వహించిన సింపోజియంలో శ్రుతి మాల్‌పానీ మాట్లాడుతూ.. నిర్వాహకులు బలమైన ఎన్‌క్రిప్షన్, మెరుగైన ఫైర్‌వాల్స్, అధునాతన డిటెక్షన్ వ్యవస్థల కోసం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న అనేక సైబర్ దాడులు హానికర కోడ్‌తో ప్రారంభం కావడం లేదన్నారు. సోషల్ ఇంజినీరింగ్, వ్యక్తుల వేషధారణ, క్లోన్ చేసిన గొంతులు, ఏఐ ఆధారిత నకిలీ కంటెంట్ వంటి కొత్త ముప్పులు పెరుగుతున్నాయని వివరించారు.
2.95 లక్షల మంది పెన్షనర్లకు అవగాహన
కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సహకారంతో రూపొందించిన ప్రజా ప్రయోజన సైబర్ భద్రత వీడియోలు, అవగాహన ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు. వీటి ద్వారా రాష్ట్రంలోని సుమారు 2.95 లక్షల మంది పెన్షనర్లు, 3 లక్షలకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సులభంగా అర్థమయ్యే విధంగా వీడియోలు, అవగాహన సామగ్రిలో వివరించారు. సింపోజియం భాగస్వామ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న గెజిటెడ్ అధికారుల ద్వారా ఈ సమాచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
మానవ విచక్షణే కీలకం
సింపోజియం మేనేజింగ్ ట్రస్టీ శ్రుతి మాల్‌పానీ ప్రారంభోపన్యాసంలో మాట్లాడుతూ.. అసలు పోరాటం టెక్నాలజీతో కాదని, మానవ విచక్షణతోనేనని పేర్కొన్నారు. డిజిటల్ వాతావరణంలో ఎదురవుతున్న కొత్త తరహా ముప్పులను ప్రజలు అర్థం చేసుకుని, సురక్షితమైన నిర్ణయాలు తీసుకునేలా చర్చలకు వేదిక కల్పించడమే సింపోజియం లక్ష్యమన్నారు. గత సింపోజియంలో జరిగిన చర్చలు, అందులో వెలువడిన ముఖ్యమైన అంశాలతో రూపొందించిన పత్రాన్ని కూడా శిఖా గోయల్‌కు అందజేశారు.

