కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకల వేళ రాజకీయ సెగలు రాజుకున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల చింపివేత ఘటన ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా ప్రత్యర్థి పార్టీల మధ్య జరిగే ఇలాంటి గొడవలు, ఇక్కడ మాత్రం సొంత పార్టీ వర్గాల మధ్యే చోటుచేసుకోవడం గమనార్హం.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. కొత్త ఏడాది సందర్భంగా పటాన్‌చెరు, అమీన్‌పూర్, రామచంద్రాపురం పరిధుల్లోని జాతీయ రహదారుల వెంట బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే, గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను చించివేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్ రావు ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరగడం కలకలం రేపింది.
ఈ ఫ్లెక్సీల చింపివేత వెనుక కాంగ్రెస్ నాయకుల హస్తం కంటే, బీఆర్‌ఎస్‌లోని అసమ్మతి వర్గాల పనేననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని (Gudem Mahipal Reddy) తిరిగి పార్టీలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే అనుచరులే ఉద్దేశపూర్వకంగా ఆదర్శ్ రెడ్డి, హరీశ్ రావు ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను చించివేసి ఉంటారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఈ ఘటనపై బీఆర్‌ఎస్ (BRS) పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కేవలం తమను టార్గెట్ చేస్తూ, దురుద్దేశపూర్వకంగానే ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి, బాధ్యులపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే అనుచరులు చెబుతుండటం విశేషం. ఏది ఏమైనా, ఈ ‘ఫ్లెక్సీ వార్’ పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌లో ఉన్న అంతర్గత విభేదాలను మరోసారి బయటపెట్టింది.

Read Also: మరోసారి వివాదంలో గ్రోక్.. ఫిర్యాదుల వెల్లువ
Follow Us On: X(Twitter)


