epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మరోసారి వివాదంలో గ్రోక్​.. కేంద్రం ఆగ్రహం

కలం, వెబ్​డెస్క్​: ఏఐ చాట్​బాట్​ గ్రోక్ మరోసారి వివాదంలో (Grok Controversy) చిక్కుకుంది. ఇప్పటికే స్థానిక భాషలు, బూతుల గురించి వివాదాల్లో చిక్కుకోగా, ఇప్పుడు కొత్తగా న్యూడ్​ ఫొటోల అంశం చేరింది. ఏదైనా మామూలు ఫొటో ఇచ్చి దాన్ని అశ్లీలంగా మార్చమని అడుతున్నారు. దీనికి గ్రోక్​ ఇచ్చిన సమాధానాన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు యూజర్లు చిన్నపిల్లలు, మహిళల ఫొటోలను మార్ఫింగ్​ చేసి, సోషల్​ మీడియాలో, అశ్లీల వెబ్​సైట్లలో పోస్ట్​ చేస్తున్నారు. న్యూ ఇయర్​ రోజు ఇది ట్రెండ్​గా మారి విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా గ్రోక్​పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ ప్రమాదక ట్రెండ్​ గురించి భారత్​లో శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

మహిళల భద్రత, గౌరవం, గోప్యతకు సంబంధించిన ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వనీ వైభవ్​కు లేఖ రాశారు. ‘గ్రోక్​ను ఉపయోగించి మహిళల చిత్రాలను మార్ఫ్​ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేస్తున్నారు. ఏఐని ఇలా దుర్వినియోగం చేయడం ప్రమాదకరం. ఇది మహిళలు, చిన్నపిల్లల భద్రతకు, హక్కులకు భంగం కలిగిస్తోంది. ఇది అనైతికం. నేరం కూడా. వెంటనే దీనిపై స్పందించి, చర్యలు తీసుకోండి’ అని ఆ లేఖలో ప్రియాంక కోరారు.

కాగా, మరోవైపు గ్రోక్ (Grok) ​లో ‘రిమూవ్​ దిస్​ పిక్చర్​’ అనే మరో ట్రెండ్​ మొదలైంది. ఏదైనా గ్రూప్​ ఫొటోను గ్రోక్​కు ఇచ్చి అందులో ‘రిమూవ్ కరెప్టెడ్​ పొలిటీషియన్​’, ‘రిమూవ్​ బ్యాడ్​ యాక్టర్​’, ‘అందమైన వ్యక్తులను మాత్రమే ఉంచు’ అంటూ రకరకాల ప్రాంప్ట్​లు ఇస్తున్నారు. సమాధానంగా గ్రోక్​ ఇచ్చే ఫొటోలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేస్తున్నారు. ఇది ఆయా ఫొటోల్లోని వ్యక్తులు, వారి అభిమానులు, కుటుంబసభ్యుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. సినీ నటులు, రాజకీయ నాయకుల అభిమానులు పరస్పరం బూతులతో తిట్టుకుంటున్నారు.

ఆ కంటెంట్​ తక్షణం తొలగించండి.. కేంద్రం

గ్రోక్​లో ఫొటోల మార్ఫింగ్​పై కేంద్రం తీవ్రంగా స్పందించింది. అశ్లీల కంటెంట్​ను తక్షణం తొలగించాలని ‘ఎక్స్​’కు ఆదేశాలు జారీ చేసింది. గ్రోక్​, ఎక్స్​ఏఐ రెండూ ఎలాన్ మస్క్​ ‘ఎక్స్​’కు చెందినవే. వీటిలో ఫొటోల మార్పు ట్రెండ్​తో అసభ్య, అశ్లీల కంటెంట్​ పోస్ట్​ అవుతోందన్న ఫిర్యాదుపై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. ఐటీ చట్టంలోని నిబంధనలను ‘ఎక్స్​’ ఉల్లంఘించిందని మండిపడింది. ఆ కంటెంట్​ను తక్షణం తొలగించాలని, తీసుకున్న చర్యల నివేదికను 72 గంటల్లోగా అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ‘ఎక్స్​’ భారత ప్రతినిధికి నోటీసు ఇచ్చింది.

Grok Controversy
Grok Controversy

Read Also: ఉమర్​ ఖలీద్​ విడుదలకు అమెరికా లేఖ.. రాహుల్​ నిర్వాకమేనన్న బీజేపీ

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>