కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ తూర్పున రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పదవి కోల్పోయిన తర్వాత జరిగిన పరిణామాలు, సొంత పార్టీలోనే తనకు ప్రత్యర్థులుగా భావించే నేతల రాజకీయ కదలికలు, మరోవైపు బీజేపీ విమర్శలు.. ఇలా వరుస పరిణామాల మధ్య సురేఖ బహిరంగ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పదవి కోల్పోయిన తర్వాత
కొండా సురేఖ మంత్రి పదవి కోల్పోయిన తర్వాత వరంగల్ తూర్పు లో కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై చర్చ మొదలైంది. కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణికి సంబంధించిన పరిణామాలు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తన రాజకీయ ప్రత్యర్థులతో సమావేశం కావడం వంటి అంశాలపై అప్పట్లో జోరుగా చర్చ జరిగింది. ఆయా పరిణామాలను కొండా వర్గం పరిశీలించినా, వెంటనే స్పందించకుండా మౌనం పాటించింది. ఇది ఎక్కువకాలం కొనసాగలేదు. మంత్రి పదవి కోల్పోయినందుకు ఎలాంటి బాధ లేదని, ఎమ్మెల్యేగా ప్రజలకు అందుబాటులో ఉంటూ కొనసాగుతానని సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదని ప్రకటించారు. దీంతో సురేఖ రాజకీయ భవిష్యత్‌పై ఊహాగానాలకు ఆమె స్వయంగా తెరదించారు.
స్థానిక ఎన్నికల్లో సీట్ల సవాల్
రాబోయే మేయర్ ఎన్నికలపై కూడా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ తూర్పు నుంచి 24 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తామని సవాల్ చేశారు. మంత్రి పదవి లేకపోయినా తన రాజకీయ బలం తగ్గలేదని చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లోనూ చర్చకు దారితీశాయి. సొంత పార్టీలో తనకు ప్రత్యర్థులుగా భావించే ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి కదలికల్లో భాగంగా సురేఖ తాజా వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారనేది పార్టీ వర్గాల్లోనూ చర్చకు పెట్టాయి.
బీజేపీ నిరసనతో మరో మలుపు
ఇలాంటి సమయంలోనే బీజేపీ నేతలు చేపట్టిన నిరసనతో మరోసారి హీట్ పెంచాయి. వరంగల్ కలెక్టరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం ఎప్పుడంటూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఎమ్మెల్యే పనితీరును ప్రశ్నిస్తూ బీజేపీ చేసిన నిరసన స్థానికంగా విస్తృత చర్చకు దారితీసింది. అయితే బీజేపీ నిరసన చేపట్టిన సమయంలోనే సురేఖ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. బీజేపీ నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు. ప్రజా సమస్యలు, వరంగల్ అభివృద్ధిపై బీజేపీ నేతలకు ఆమె ప్రత్యక్షంగా సవాల్ విసిరారు.
కేంద్రం నుంచి నిధులకు సవాల్
వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు చొరవ చూపాలని సురేఖ సవాల్ చేశారు. కేవలం విమర్శలు చేయడం కాకుండా అభివృద్ధికి సహకరించాలని సూచించారు. తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసినా తమ అనుచరుల మీద ఈగ వాలిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. “ మా జోలికొస్తే ఆడవాళ్లతో కొట్టిస్తా” అని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమయ్యాయి.
ఇరు వర్గాలకు కౌంటర్?
ఒకే సందర్భంలో సురేఖ అటు సొంత పార్టీలోని ప్రత్యర్థి నేతలకు, ఇటు బీజేపీ నేతలకు రాజకీయ సందేశం ఇచ్చినట్లుగా ఆమె వర్గీయులు పేర్కొంటున్నారు. మంత్రి పదవి పోయినా.. కాంగ్రెస్‌లోనే ఉంటానని, అధిక డివిజన్లు గెలుస్తామని సవాల్ చేయడం ద్వారా తన రాజకీయ లక్ష్యాన్ని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే అందుబాటులో లేరంటూ బీజేపీ ప్రచారం చేస్తుండగా.. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సురేఖ ప్రతిసవాల్ చేయయడం చర్చకు మరింత ఆజ్యం పోసింది. సురేఖ తాజా వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో నియోజకవర్గ రాజకీయాల్లో మరిన్ని పరిణామాలకు దారితీస్తాయా అనే చర్చ మొదలైంది. మేయర్ ఎన్నికల నాటికి తూర్పులో రాజకీయ పోరు మరింత తీవ్రం కావచ్చన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

