కలం, నల్గొండ బ్యూరో: మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో తలపెట్టిన ‘అంబ భవాని’ లిఫ్ట్ ఇరిగేషన్ (Amba Bhavani Lift Irrigation) ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యం, ప్రకృతి ఆటంకాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. పనులు ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. ఎప్పటికి పూర్తయి సాగునీరు ఎప్పుడు అందేనో అంటూ.. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండల రైతులు నిరాశ చెందుతున్నారు.
2022లో బీఆర్ఎస్ హయాంలో రూ.184.56 కోట్ల అంచనా వ్యయంతో నేరేడుగొమ్ము మండలం చిన్న మునిగల్, పడమటితండా సమీపంలో అంబ భవాని లిఫ్ట్ పనులకు శ్రీకారం చుట్టారు. నాగార్జునసాగర్ వెనుక జలాల (బ్యాక్ వాటర్) నుంచి నీటిని మళ్లించి, నేరేడుగొమ్ము మండల పరిధిలోని దాదాపు 13 వేల ఎకరాల పొలాలకు నిరంతర సాగునీరు అందించడమే ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. రెండేళ్ల వ్యవధిలోనే నిర్మాణ పనులన్నింటినీ శరవేగంగా పూర్తి చేసి రైతులకు నీరందిస్తామని ఆనాటి పాలకులు, అధికారులు ఆర్భాటం చేశారు. కానీ కాలం గడిచిపోతున్నా లిఫ్ట్ పనుల్లో అడుగు కూడా ముందుకు పడటం లేదు.
‘సాగర్’ బ్యాక్ వాటర్ దెబ్బ..
ప్రాజెక్టు ఆలస్యానికి ప్రధానంగా నాగార్జునసాగర్ వెనుక జలాలు పెద్ద ప్రతిబంధకంగా మారాయి. కృష్ణానదిలో వరద పెరిగి సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరినప్పుడల్లా వెనుక జలాలు ఉప్పొంగి అంబ భవాని లిఫ్ట్ నీటిని నిల్వ చేసే ప్రతిపాదిత ప్రాంతాన్ని ముంచెత్తుతున్నాయి. ముంపు నీటిని దాటుకుని పనులు చేపట్టడం సాధ్యం కాకపోవడం, దీనికి ఇతర ప్రత్యామ్నాయ ఇంజనీరింగ్ మార్గాలు లేకపోవడంతో నీటిమట్టం తగ్గే వరకు కాంట్రాక్టర్లు పనులను పూర్తిగా నిలిపివేయాల్సి వస్తోంది. దీంతో ఏటా వర్షాకాలంలో నెలల తరబడి పనులు స్తంభించిపోతున్నాయి.
పరిహారం చెల్లింపులో జాప్యం
లిఫ్ట్ పథకంలో భాగంగా నీటిని పొలాలకు తరలించేందుకు దాదాపు 72 కిలోమీటర్ల మేర పైప్లైన్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం స్థానిక రైతుల నుంచి భారీగా భూ సేకరణ చేశారు. అయితే తమ భూములను ప్రాజెక్టు కోసం ఇచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులో ప్రభుత్వాలు తీవ్ర జాప్యం చేశాయి. పరిహారం డబ్బులు చేతికి అందకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న రైతులు, వేరే మార్గం లేక ప్రస్తుతం ఆ భూముల్లోనే పంటలు సాగు చేసుకుంటున్నారు. రైతుల పొలాల్లో పంటలు ఉండటంతో పైప్లైన్ పనుల కోసం తవ్వకాలు జరిపేందుకు కాంట్రాక్టర్లకు అవకాశం లేకుండాపోయింది.
పంట కాలం పూర్తయ్యే వరకు వేచి చూడాల్సి రావడం కూడా ప్రాజెక్టు ఆలస్యానికి మరో ప్రధాన కారణంగా మారింది. రైతుల భూములకు వెంటనే నష్టపరిహారాన్ని విడుదల చేసి, సాంకేతిక అడ్డంకులను అధిగమించేలా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకుని అంబ భవాని లిఫ్ట్ ఇరిగేషన్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తేనే నేరేడుగొమ్ము మండల మెట్ట రైతులకు శాశ్వత సాగునీటి సౌకర్యం అందుతుంది.

