కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ( CM Chandrababu) నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో భాగంగా సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ద్వారా పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో విజయవాడలో దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత విముక్తి కలిగిస్తూ, దాదాపు 24,057 పేద కుటుంబాలకు సంపూర్ణ యాజమాన్య హక్కులతో కూడిన పట్టాలను సీఎం చంద్రబాబు అందజేయనున్నారు.
రూ. 9,800 కోట్ల అంచనా విలువ కలిగిన భూములను ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా రెగ్యులరైజేషన్ చేయనుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే ప్రతి కుటుంబానికి సగటున రూ. 40 లక్షల వరకు విలువైన స్థిరాస్తిపై పూర్తి హక్కులు దక్కనున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలోని 8 శాసనసభ నియోజకవర్గాలు, 15 మండలాలకు చెందిన నిరుపేదలు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు. ముఖ్యంగా విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ పరిధిలోని కొండ ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజల సుదీర్ఘ నిరీక్షణకు ఈ పంపిణీతో తెరపడనుంది.
సామాజిక వర్గాల వారీగా బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ , ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన వేలాది కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. గతంలో విశాఖపట్నంలో 28 వేలకు పైగా కుటుంబాలకు వేల కోట్ల విలువైన భూముల హక్కులను కల్పించినట్లే, ఇప్పుడు విజయవాడలోనూ ఈ భారీ పట్టాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. ఆస్తులపై హక్కులు లభించడం వల్ల నివాసితులకు ఆర్థిక భద్రతతో పాటు భవిష్యత్తుకు ధైర్యం చేకూరుతుందని ఆయా వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

