కలం, మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో(Peddareddypet) వృద్ధురాలు కొత్తగాడి పోచమ్మ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బంగారు ఆభరణాల కోసమే ఇంటి పక్కనే ఉన్న నర్సమ్మ (46) ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 24న పెద్దారెడ్డిపేటకు చెందిన వృద్ధురాలు పోచమ్మను నర్సమ్మ హత్య చేసి, ఆమె వద్ద ఉన్న బంగారు నగలను దొంగలించినట్లు పోలీసులు గుర్తించారు. పోచమ్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నర్సమ్మ.. ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కాజేయాలని పథకం వేసింది. ఈ క్రమంలోనే పోచమ్మను పథకం ప్రకారం హత్య చేసి, ఆమె శరీరంపై ఉన్న బంగారు నగలతో పరారైనట్లు పోలీసులు తెలిపారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన స్థలంలో లభ్యమైన నిందితురాలి చేతి గాజుల ముక్కలు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. సాంకేతిక ఆధారాల సహాయంతో పొరుగున ఉన్న నర్సమ్మే ఈ హత్యకు పాల్పడినట్లు గుర్తించారు. నర్సమ్మను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె వద్ద నుంచి పోచమ్మకు చెందిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు జోగిపేట సీఐ అనిల్ కుమార్ వెల్లడించారు. కాగా, వృద్ధురాలి హత్య కేసులో భార్య నర్సమ్మను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె భర్త పట్నం యాదయ్య మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తన ఇంట్లో పురుగుల మందు తాగి మృతి చెందాడు. భార్య అరెస్ట్.. అనంతరం భర్త మృతితో పెద్దారెడ్డిపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

