కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలని ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినట్లు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయించి, త్వరగా అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
మంగళవారం గుండారం శివారులో పాఠశాలకు అవసరమైన 25 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పరిశీలించారు. మరో స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వివరించారు. మొదటి దశలో జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు మంజూరయ్యాయని.. రెండో దశలో భాగంగా అర్బన్ నియోజకవర్గంలో మంజూరయ్యేలా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, ఈఈ రవీందర్, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

