కలం, వెబ్ డెస్క్: అమెరికా, ఇరాన్ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. అగ్రరాజ్యంపైకి ఇరాన్ మిస్సైల్స్ మాత్రమే కాకుండా.. సోషల్ మీడియాలో తెలుగు డైలాగ్స్‌తో పవరఫుల్ వార్నింగ్ కూడా ఇస్తోంది. వివిధ దేశాల్లోని ఇరాన్ ఎంబసీలు (Iran Embassy) ట్రంప్‌ను ఉద్దేశిస్తూ.. బాలయ్య, ప్రభాస్ హీరోలతో కూడిన డైలాగ్స్ పోస్ట్ చేస్తుండటంతో తెగ వైరలవుతున్నాయి. ఆ మాటకొస్తే కేవలం టాలీవుడ్ హీరోలే కాకుండా.. బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలోని హీరోల డైలాగ్స్, కొన్ని సినిమాల్లోని సీన్లను సందర్భానికి తగ్గట్లు పోస్ట్ చేస్తుండటంతో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ కోవలో హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ ముందు వరుసలో ఉంది.
భగవంత్ కేసరిలో బాలయ్య పోస్టుతో..
జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ ‘భగవంత్ కేసరి’లో బాలయ్య క్లిప్ పోస్ట్ చేసింది. దీనిలో విలన్లు కాల్చే బుల్లెట్లు తనకు తాకకుండా, బాలయ్య ఒక మూతను అడ్డుపెట్టుకుంటారు. ‘ఇరాన్‌ను నాశనం చేస్తానని ట్రంప్ బెదిరిస్తున్నాడు. కానీ, ఇరాన్ ఎంతో రక్షణ వ్యవస్థ ఉన్న దేశమని ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే.. ఇరాన్ ఇటీవల హాలీవుడ్ సినిమాలకు బదులుగా బాలీవుడ్ సినిమాలు చూస్తోంది’ అని క్యాప్షన్ పెట్టింది. సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అమెరికా తమను బెదిరిస్తే.. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసని చెప్పడమే ఇరాన్ ఉద్దేశంగా నెటిజన్లు పేర్కొంటున్నారు.
బాహుబలిలో ప్రభాస్ వీడియోతో..
హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ ప్రభాస్ ‘బాహుబలి’ మూవీతో ఆసక్తికర పోస్ట్ చేసింది. కాలకేయులు మహిష్మతి మీదకు దండెత్తడానికి వచ్చినప్పుడు.. మూగ జీవాలను బలి ఎందుకు ఇవ్వడం.. మరుగుతున్న నా రక్తాన్ని అమ్మవారికి అర్పించి.. యుద్ధాన్ని ప్రారంభిస్తానని ప్రభాస్ అంటాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఇరాన్.. “మేం ఎప్పటికీ ఎవరికీ తలవంచం. కాలకేయులతో పోరాడిన బాహుబలిలా.. మాతృభూమి కోసం మేం కూడా త్యాగానికి సిద్ధమై.. మా రక్తాన్ని ధారబోస్తాం” అని క్యాప్షన్ పెట్టింది. అమెరికాకు తలవంచబోమని.. ఇరాన్‌ను రక్షించుకోవడానికి ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమన్నది ఇరాన్ ఎంబసీ చేసిన పోస్టుకు అర్థం. ఇలా.. తెలుగు చిత్రాల్లోని పవరఫుల్ డైలాగ్స్‌ను అమెరికాకు వార్నింగ్ ఇవ్వడానికి ఇరాన్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.

