కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) పరిధిలోని సాకి చెరువు (Saki Cheruvu) ఎఫ్‌టీఎల్ భూముల ఆక్రమణలపై హైడ్రా అధికారులు చర్యలు చేపట్టారు. చెరువు శిఖం భూమిలో మట్టి పోసి అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే స్థానికుల ఫిర్యాదుల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. సాకి చెరువు పరిధిలోని సుమారు నాలుగు ఎకరాల శిఖం భూమిని బీఆర్‌ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అఫ్జల్ మట్టి పోసి ఆక్రమించేందుకు యత్నించినట్లు స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. చెరువు విస్తీర్ణాన్ని తగ్గించి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా అధికారులు రెవెన్యూ, నీటిపారుదల శాఖ సిబ్బందితో కలిసి సాకి చెరువు వద్దకు చేరుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన సుమారు నాలుగు ఎకరాల ఎఫ్‌టీఎల్ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో పాటు చెరువు సరిహద్దుల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. చెరువులు, కుంటల శిఖం భూములతో పాటు ప్రభుత్వ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు.

