కలం, రామగుండం: తెలంగాణ రైతాంగానికి కీలకమైన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (RFCL) ఉత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తూ, ప్లాంట్‌ను నిర్వీర్యం చేసే కుట్రలను సహించేది లేదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ (MP Gaddam Vamsi Krishna) హెచ్చరించారు. RFCL పరిరక్షణ కోసం రామగుండం నుంచి ఢిల్లీ వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
పూర్తి సామర్థ్యంతో నడపాలి
ఏటా 12 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సిన RFCL, తరచూ షట్‌డౌన్ల వల్ల 7–8 లక్షల టన్నులకే పరిమితమవుతోందని, దీనికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌లో పనిచేస్తున్న 3,000 మంది కార్మికుల ఉద్యోగ భద్రత, వేతనాలు, సంక్షేమాన్ని కేంద్రం తక్షణమే పట్టించుకోవాలన్నారు.నోయిడాలో ఉన్న RFCL ప్రధాన కార్యాలయాన్ని వెంటనే రామగుండానికి తరలించాలని కోరారు.
ప్రైవేటీకరణపై నిలదీత
ప్లాంట్‌ను కావాలని బలహీనపరిచి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తే రైతు, కార్మిక వర్గాలతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు నోరు విప్పి పార్లమెంట్‌లో రైతు ప్రయోజనాల కోసం గళం విప్పాలని ఎంపీ పిలుపునిచ్చారు.

