కలం, కరీంనగర్: హైకోర్టు తీర్పు ఇచ్చి ఇన్ని రోజులవుతున్నా సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వహించగా వారి చుట్టూ తిరిగి తీవ్ర మనస్తాపానికి గురై ఆసోద రాజయ్య (Asoda Rajaiah) అనే రైతు గుండెపోటుతో మరణించినట్లు ఆయన సోదరుడు ఆసోద రవీందర్ ఆరోపించారు. కరీంనగర్‌లో (Karimnagar) ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని సర్వే నెం. 179/1 నుండి 179/6 పరిధిలో ఉన్న 13 ఎకరాల 34 గుంటల తమ పూర్వీకుల పట్టా భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని తెలంగాణ హైకోర్టు 03-12-2025 రోజున స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆయన తెలిపారు.
అంతేకాకుండా సర్వే నివేదిక పూర్తయి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లు సైతం హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఎండార్స్‌మెంట్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా యంత్రాంగం ఫైలును పక్కన పడేసి వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు వచ్చి ఇన్ని రోజులైనా ఆన్‌లైన్ పోర్టల్‌లో మార్పులు చేయకపోవడం వల్లే తన సోదరుడు బలైపోయాడని, మృతికి కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నూతన హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొత్తపల్లి పరిధిలోని 13.34 ఎకరాల భూమిని వెంటనే 22-A నిషేధిత జాబితా నుండి తొలగించి, భూభారతి, TS-IGRS పోర్టళ్లలో పట్టా భూమిగా ఆన్‌లైన్ రికార్డులను నమోదు చేయాలని డిమాండ్ చేశారు.రాబోయే 3 రోజుల్లోగా భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించకపోతే కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట కుటుంబసభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేపడతామని స్పష్టం చేశారు.
ఈ విషయమై ఇప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సిసిఎల్ఏ, జాతీయ ఎస్.సి. కమిషన్ ఛైర్మన్‌లకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా వినతిపత్రాలు పంపినట్లు రవీందర్ వెల్లడించారు.

