కలం, మెదక్ బ్యూరో : మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో జరిగిన సర్వే (KCR Farmhouse Survey).. చుట్టుపక్కల గ్రామాల మధ్య సరిహద్దుల వివాదం రాజేసింది. తమ గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్లను లేకుండా చేసి.. ఎర్రవల్లి గ్రామ సర్వే నెంబర్లలతో కలిపివేశారని శివారు వెంకటాపూర్ గ్రామస్తులు అరోపిస్తున్నారు. తమ తాతల నుండి సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు, రికార్డుల మాయం అవడంపై శివారు వెంకటపూర్ రైతులు పోరాటానికి సిద్ధమయ్యారు.
కేవలం ఎర్రవల్లిలో సర్వే నెంబర్ 325లో మాత్రమే భూముల సర్వే చేశారని, తమ గ్రామ శివారులోని పలు సర్వే నెంబర్లలో సర్వే చేస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించిన అసలు వాస్తవాలు బయటకు వస్తాయని, వెంటనే సమగ్ర భూ సర్వే చేసి తమ గ్రామ భూములను పరిరక్షించాలని శివారు వెంకటాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పరిధిలోని ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల్లో భూ వివాదం కొనసాగుతోంది. కేసీఆర్ ఫామ్‌హౌస్ ను ఆనుకుని ఉన్న తమ గ్రామ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు లేకుండా చేసి, రికార్డులను తారుమారు చేసి తమ గ్రామ భూములను ఆక్రమించారని శివారు వెంకటపూర్ కు చెందిన స్థానిక రైతులు, బాధితులు మీడియా ముఖంగా తీవ్ర ఆరోపణలు చేశారు. పాత నక్షలను మార్చేసి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సరిహద్దు రికార్డుల తారుమారు..!
గతంలో ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల్లో నల్ల రాళ్లు, తెల్ల రాళ్లతో సరిహద్దు గుర్తులు ఉండేవని రైతులు చెబుతున్నారు. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ మధ్య ఉన్న పాత నక్ష ప్రకారం సుమారు 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో తమ పరిధిలోని 188 ఎకరాల భూమి ఉండేదని ,కానీ శివారువెంకటాపూర్ భూములను ఎర్రవల్లి సర్వే నంబర్ 325 లోకి కలిపేసి మొత్తం 388 ఎకరాల ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేశారని మండిపడ్డారు.
తమ పూర్వీకుల కాలం నుంచి శివారు వెంకటాపూర్ పరిధిలో ఉండి, సాగు చేసుకుంటున్న సర్వే నంబర్లు 41, 38, 47, 85, 88, 100 భూములను కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా రికార్డులు మార్చి, ఎర్రవల్లి శివారులోకి కలిపేశారని ఆరోపించారు. అయితే 2017లో ధరణి పోర్టల్ తెచ్చిన తర్వాత, కేసీఆర్ హయాంలో రికార్డులను పూర్తిగా మార్చివేశారని పేర్కొన్నారు. ఈ కలిపేసిన భూముల్లో తమ గ్రామానికి సంబంధించిన పలు సర్వే నెంబర్లుకు చెందిన భూములు ఉన్నాయని చెబుతున్నారు.
తమ సరిహద్దు భూములను గుంజుకుని రోడ్డున పడేశారని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సర్వే నంబర్ల పరిధిలోని సుమారు 40 ఎకరాల భూమి కేసీఆర్ ఫామ్‌హౌస్ కాంపౌండ్ లోపలికి వెళ్లిపోయిందని, పక్కాగా ఉన్న తమ సాగుభూములు, డ్రిప్ పందిళ్లు, కడీలు, పాడి పశువుల పాకలను స్వాధీనం చేసుకున్నారని రైతులు ఆరోపించారు.
సర్వే తీరుపై అసంతృప్తి
ఇటీవల ఎర్రవల్లి గ్రామంలోని నిర్వహించిన సర్వే (KCR Farmhouse Survey) ను రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా కొలతలు వేయడం లేదని వెంకటాపుర్ రైతులు ఆరోపించారు. ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 325 లో మాత్రమే అధికారులు సర్వే చేయడంపై శివారు వెంకటాపూర్ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాత నక్ష ప్రకారం ఇరు వైపులా ఉన్న గ్రామాల మధ్య సుమారు 388 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉందని.. పాత రికార్డుల ప్రకారం ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామ పరిధిలోని భూములను మొత్తం రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
2017 తర్వాత తమ గ్రామానికి చెందిన పలు సర్వే నెంబర్లు కనిపించకుండా పోయాయని, అసలు రికార్డుల్లో లేకుండా చేశారని ఆరోపిస్తున్నారు. సమగ్ర సర్వే జరిగితే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుస్తుందని, భూముల మాయం సంగతి బయట వస్తుందని చెబుతున్నారు. కేవలం ఒకే సర్వే నెంబర్ లో సర్వే చేసి భూముల వివరాలు ఎలా తెలుస్తాయని గ్రామ రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పాత రికార్డుల ప్రకారం ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల పరిధిలోని భూములను సర్వే చేసి వాస్తవాలను బయటపెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సర్వే జరిగిన తీరు, నోటీసుల ప్రక్రియను చూస్తుంటే సర్వే ప్రక్రియపైన పలు అనుమానాలు వస్తున్నాయని శివారు వెంకటపూర్ రైతులు చెబుతున్నారు.
రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే..
ధరణి ఫలితంగా ఆన్‌లైన్ లేదా ధరణి పోర్టల్‌లో తమ భూముల వివరాలు చూపించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పొరపాట్ల వల్ల ఈ తప్పు జరిగిందా లేదా మాజీ సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్ల జరిగిందా అనేది స్పష్టం చేయాలంటున్నారు. ఎర్రవల్లి శివారు, తమ గ్రామాల మధ్య ఉన్న సరిహద్దు హద్దులను వెంటనే రీ-సర్వే చేసి భూములకు సంబంధించిన హద్దులను పక్కాగా తేల్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ భూముల వ్యవహారంపై సర్వేలు జరుగుతున్న నేపథ్యంలో తమ గ్రామల భూముల సరిహద్దులను వెంటనే రీ-సర్వే చేసి తేల్చాలని, సిద్ధిపేట అడిషనల్ కలెక్టర్ తో పాటు మర్కూక్ తహసీల్దార్‌కు శివారు వెంకటాపూర్ గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. సర్వేను కేవలం సర్వేను నంబర్ 325కే పరిమితం చేయకుండా తమ గ్రామశివారు భూముల్లో సైతం సర్వే చేయాలని కలెక్టర్‌కు నుండి ఎమ్మార్వో వరకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
తరతరాలుగా సాగు చేసుకున్న భూమి రికార్డులను మార్చడం వలన నష్టపోయామని, ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ మధ్య ఉన్న సరిహద్దులపై ప్రభుత్వం తక్షణమే నిష్పక్షపాత రీ-సర్వే జరిపి రికార్డులను పునరుద్ధరించాలని కొరుతున్నారు. తమ గ్రామానికి జరుగుతున్న అన్యాయంపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నేరుగా వినతిపత్రం అందజేస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నమ్మకం ఉందని, రీ-సర్వే ద్వారా తమ గ్రామ భూములు పరిరక్షించబడి అసలు వాస్తవాలు బయటకు వస్తయని శివారు వెంకటపూర్ రైతులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

