కలం, వెబ్ డెస్క్: తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ (Aparesh Kumar Singh) సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని కొలీజియం నిర్ణయం తీసుకుంది. గుజరాత్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీత అగర్వాల్, ఢిల్లీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయను కూడా సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా ప్రమోషన్లు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సంబంధిత ఫైల్ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తరువాత రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తరువాత ముగ్గురిని సుప్రీం కోర్టు జడ్జిలుగా నియమిస్తూ గెజిట్ వెలువడనుంది.
తెలంగాణకు కొత్త సీజే..
జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో తెలంగాణకు త్వరలోనే కొత్త సీజే రాబోతున్నారు. 2025 జులై 19న జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక తీర్పులను ఆయన నేతృత్వంలోని బెంచ్ వెలువరించింది. జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ఢిల్లీ యూనివర్సిటీలో లా పూర్తి చేసి.. 1990లో పాట్నా హై కోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. 2012లో జార్ఖండ్ హై కోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022లో ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొంది.. త్రిపురలో పనిచేశారు. అక్కడి నుంచి తెలంగాణకు బదిలీపై వచ్చారు.

