కలం, ముధోల్ : ముధోల్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల ప్రత్యేక సమావేశానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్ష జరిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్పంచులు విన్నవించిన సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
వ్యవసాయ శాఖ పరిధిలో రైతులకు అందుతున్న సేవలు, పంటల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు అవసరమైన సేవలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యాన పంటల సాగు, రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలు, శాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలపై ఆయన (Pawar Ramarao Patel) వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక వసతులు, ఉపాధ్యాయుల పరిస్థితిపై సమీక్షించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలపై వివరాలు తెలుసుకుని, ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

