ఖమ్మం/భద్రాచలం బ్యూరో: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం (Bhadrachalam) గోదావరి తీరం ఇకపై ప్రతి శనివారం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోనుంది. భక్తుల కోరిక మేరకు, ప్రభుత్వం ‘ఏరు – ద రివర్ ఫెస్టివల్’లో భాగంగా ప్రతి శనివారం గోదావరి నదికి హారతి (Godavari Harathi) కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం, ఐటీడీఏ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాయి. సాధారణంగా ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాల్లో మాత్రమే కనిపించే నదీ హారతి వైభవం, ఇకపై ప్రతి వారం భక్తులకు కనువిందు చేయనుంది. ఈ వేడుకల్లో భాగంగా నదీ హారతితో పాటు గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
కేవలం ఆధ్యాత్మికతకే పరిమితం కాకుండా, నదుల ప్రాముఖ్యతను, పర్యావరణ పరిరక్షణను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన గోదావరి నదిని కాలుష్య రహితంగా ఉంచుకోవాలని, నది పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని ఈ వేడుక ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నిర్ణయం (Godavari Harathi) వల్ల భద్రాచలానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని పర్యాటక శాఖ ఆశిస్తోంది. ప్రతి శనివారం ఈ వేడుక జరగడం వల్ల స్థానిక వ్యాపారాలు పుంజుకోవడంతో పాటు, గోదావరి తీరం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందనుంది.
Read Also: రెండు రాష్ట్రాల నీటి వివాదంపై కేంద్రం కీలక నిర్ణయం
Follow Us On: Instagram


