కలం, ఖమ్మం బ్యూరో: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం (Bhadrachalam Temple)లో భక్తుల కానుకలు వెల్లువెత్తాయి. గతంలో 22/06/2026 నాటి లెక్కింపు తర్వాత, గడిచిన 98 రోజుల వ్యవధికి గాను స్వామివారి హుండీలను దేవస్థాన అధికారులు, సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం లెక్కించారు.
ఈ లెక్కింపులో స్వామివారికి నగదు రూపంలో మొత్తం రూ. 2,12,40,214 (రెండు కోట్ల పన్నెండు లక్షల నలభై వేల రెండు వందల పద్నాలుగు రూపాయలు) రాబడి సమకూరింది. నగదుతో పాటు భక్తులు తమ మొక్కుబడుల రూపంలో 0.170 గ్రాముల మిశ్రమ బంగారాన్ని, 1 కిలో 400 గ్రాముల మిశ్రమ వెండిని స్వామివారికి కానుకగా సమర్పించుకున్నారు.
స్వదేశీ భక్తులతో పాటు విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా శ్రీరామచంద్రస్వామివారికి విదేశీ కరెన్సీని భారీగా కానుకలుగా అందించారు. ఇందులో అత్యధికంగా అమెరికాకు చెందిన 545 డాలర్లు లభించగా, నేపాల్‌కు చెందిన 140 రూపాయలు, యూఏఈకి చెందిన 135 దిర్హామ్‌లు, ఇంగ్లాండ్‌కు చెందిన 110 పౌండ్లు లెక్క తేలాయి. వీటితో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్‌లకు చెందిన 60 డాలర్ల చొప్పున, కెనడాకు చెందిన 50 డాలర్లు, యూరప్‌కు చెందిన 30 యూరోలు సమకూరాయి.
అలాగే ఖతార్‌కు చెందిన 11 రియాల్స్, భూటాన్‌కు చెందిన 10 న్గుల్‌త్రమ్‌లు, కువైట్‌కు చెందిన 6 దినార్లతో పాటు ఒమన్, మలేషియా, బహ్రెయిన్ దేశాల కరెన్సీలు ఒక్కొక్కటి చొప్పున, మలావి క్వాచా కరెన్సీ కూడా హుండీలో లభ్యమైనట్లు ఆలయ అధికారులు తెలిపారు.

