భద్రాద్రి జిల్లాలో న్యాయ వికేంద్రీకరణకు బలమైన పునాది!

కలం, ఖమ్మం బ్యూరో: ​తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 59 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 200 నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను (Civil Judge Courts) మంజూరు చేయడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) తో పాటు పలు న్యాయవాద సంఘాలు సుదీర్ఘకాలంగా చేస్తున్న పోరాటాల ఫలితంగా వెలువడిన ఈ ఉత్తర్వుల ప్రకారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు (Bhadadri Kothagudem) మొత్తం ఐదు నూతన కోర్టులు కేటాయించబడ్డాయి.

అందులో కొత్తగూడెం జిల్లా కేంద్రానికి మూడు, భద్రాచలానికి ఒకటి, మణుగూరుకు మరొకటి కేటాయించారు. అయితే, కాగితం మీద కనిపించే ఈ కేటాయింపులు భద్రాద్రి జిల్లాలోని భౌగోళిక, పారిశ్రామిక, ఏజెన్సీ చట్టాల క్షేత్రస్థాయి అవసరాలకు ఏమాత్రం సరిపోలడం లేదనే చర్చ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా నడుస్తోంది.

​ముఖ్యంగా కొత్తగూడెంకు కేటాయించిన మూడు అదనపు కోర్టులలో కనీసం ఒక కోర్టునైనా సమీపంలోని పాల్వంచ పట్టణంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. పాల్వంచ కేవలం కొత్తగూడెం పక్కన ఉన్న ప్రాంతం మాత్రమే కాదు. శతాబ్దాల చరిత్ర కలిగిన పాల్వంచ సంస్థానంగా, నేడు కేటీపీఎస్, ఎన్‌ఎండీసీ స్పాంజ్ ఐరన్ యూనిట్ వంటి బహుళ పరిశ్రమలకు నిలయమై “పవర్ సిటీ”గా పేరొందింది. వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు, పరిసర గ్రామాల ప్రజలతో నిత్యం కిటకిటలాడే ఈ ప్రాంతంలో భూ-ఆస్తి లావాదేవీలు, కార్మిక, వాణిజ్య వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ప్రస్తుతం పాల్వంచ సివిల్ కేసులన్నీ కొత్తగూడెం కోర్టులకే వెళ్తుండటంతో కక్షిదారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర శ్రమకు గురవుతున్నారు. పాల్వంచలో ఒక శాశ్వత కోర్టును ఏర్పాటు చేస్తే న్యాయం ప్రజల గుమ్మ ముందుకు చేరడమే కాకుండా, కొత్తగూడెం కోర్టులపై ఉన్న విపరీతమైన కేసుల భారం కూడా తగ్గుతుంది. ఇది కొత్తగూడెం ప్రాధాన్యతను తగ్గించడం ఎంతమాత్రమూ కాదు, జిల్లా వ్యాప్తంగా న్యాయసేవలను సమతుల్యంగా వికేంద్రీకరించడమే అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

​మరోవైపు మణుగూరుకు కేటాయించిన సివిల్ కోర్టు విషయంలో ఒక పెద్ద చట్టపరమైన ప్రతిబంధకం ఎదురవుతోంది. మణుగూరు ప్రాంతం ఏజెన్సీ పరిధిలోకి రావడం, అక్కడ లాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్ (1/70 చట్టం) అమలులో ఉండటం వల్ల పూర్తిస్థాయి సివిల్ కోర్టు నిర్వహణలో సాంకేతిక చిక్కులు తప్పవు. దీనికి వ్యూహాత్మక పరిష్కారంగా కేసుల నమోదును కొత్తగూడెం కోర్టులో చేపట్టి, కేసు విచారణలను మాత్రం మణుగూరు కోర్టులో జరుపుకునే వెసులుబాటు (Camp Court/Bench system) కల్పిస్తే లక్షకు పైగా ఉన్న మణుగూరు ప్రజలకు లబ్ధి చేకూరుతుందనీ సీనియర్ న్యాయవాదులు కోరుతున్నారు.

అదే సమయంలో, 95 శాతం ఏజెన్సీ ప్రాంతంగా ఉన్న ఈ జిల్లాలో గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వివాదాల త్వరిత పరిష్కారానికి ‘ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు’ ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, దానితో పాటు ఫ్యామిలీ, కన్స్యూమర్, లేబర్ కోర్టులను కూడా కొత్తగూడెంలో వెంటనే అందుబాటులోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

​పాల్వంచకు కోర్టును మళ్లించడం అంటే చరిత్రను గౌరవించడమే కాకుండా, భవిష్యత్తుకు బలమైన న్యాయ పునాది వేయడమే. మంజూరైన కోర్టులను స్థానిక అవసరాలకు అనుగుణంగా కేటాయించేలా జిల్లా ప్రజాప్రతినిధులు, న్యాయవాద సంఘాలు, ప్రజాసంఘాలు ఏకతాటిపై నిలిచి తెలంగాణ హైకోర్టుకు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర వినతిపత్రం సమర్పించాల్సిన తక్షణ అవసరం ఏర్పడిందనేది ఐలు వంటి న్యాయవాద సంఘాలు పేర్కొంటున్నాయి.

పొనుగోటి కిషన్ రావు, మణుగూరు, AILU భద్రాద్రి జిల్లా అధ్యక్షులు

కొత్తగూడెం జిల్లా కోర్టుకు కొత్త బిల్డింగ్ కోసం ప్రభుత్వం 15 ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఇంతవరకూ నిర్మాణం చేపట్టలేదు. అలాగే కొత్తగూడెం జిల్లాకు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు, ఫ్యామిలీ కోర్టు,కన్స్యూమర్ కోర్టు, లేబర్ కోర్టు రావాల్సిన అవసరం ఉంది. అలాగే పాల్వంచ లో కూడా ఒక కోర్టు ఏర్పాటు చేయాలి. 1978 జస్టిస్ అమరేశ్వరీ తీర్పు ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో సివిల్ కోర్టు 2012 వరకూ నిర్వహించారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేసి మణుగూరులో సివిల్ కోర్టు ఏర్పాటు చేయవచ్చు లేదా కొత్తగూడెం కోర్టులో కేసు ఫైల్ చేసి మణుగూరు కోర్టులో విచారణ చేసుకునే వెసులు బాటు అయినా కల్పించాలి.

జాడి చొక్కరావ్, సీనియర్ న్యాయవాది, మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. ఈ ఏడు మండలాల్లో రెండు లక్షల వరకు గిరిజన, గిరిజనేతర ప్రజలు ఉన్నారు. మణుగూరులో సివిల్ కోర్టు లేకపోవడం వలన ఇక్కడి గిరిజనేతరులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కావున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ విడుదల చేసి సివిల్ కోర్టు ఏర్పాటు చేయాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>