కలం, నిర్మల్: అర్హులైన బీడీ కార్మికులకు చేయూత పెన్షన్ కోసం (Beedi Workers Pension) దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. స్థానిక పెన్షనర్ల భవనం నుండి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్ల రాజన్న మాట్లాడుతూ.. బీడీ కార్మికులు తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో బీడీ పరిశ్రమ క్షీణించి కార్మికులకు పని దినాలు తగ్గిపోయి ఉపాధి కరువవుతోందని పేర్కొన్నారు. పీఎఫ్ కటాఫ్ నిబంధనను ఎత్తివేసి అర్హులైన బీడీ కార్మికులందరికీ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ప్రభుత్వం పెన్షన్ దరఖాస్తుల కోసం విడుదల చేసిన నమూనాలో ఏడు కేటగిరీలకు మాత్రమే అవకాశం కల్పించిందని, బీడీ కార్మికులు, బీడీ ప్యాకర్లు, నెలసరి ఉద్యోగులు, బీడీ కమిషన్దారులు, టేకేదారులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే దరఖాస్తు నమూనాలో ఆయా కేటగిరీలను చేర్చి పెన్షన్ పొందేందుకు అవకాశం కల్పించాలని కట్ల రాజన్న డిమాండ్ చేశారు.
అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బక్కన్న, జిల్లా కార్యదర్శి రామలక్ష్మణ్, సహాయ కార్యదర్శి గంగన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి లక్ష్మి, కోశాధికారి గఫూర్, నాయకులు గంగమణి, రేష్మ, దేవవ్వ, కమల, కవిత తదితరులు పాల్గొన్నారు.

