కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్(Asian Games Badminton) నిర్వహణపై భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) అసంతృప్తి వ్యక్తం చేశారు. క్వార్టర్ఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్ యు ఫెయి చేతిలో ఓటమి అనంతరం మాట్లాడిన సింధు.. తక్కువ వ్యవధిలో వరుస మ్యాచ్‌లు ఆడాల్సి రావడం వల్ల కోలుకోవడానికి తగినంత సమయం లభించలేదని తెలిపారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండో మ్యాచ్ ముగించుకున్న తాను.. మళ్లీ ఆదివారం ఉదయమే క్వార్టర్‌ఫైనల్ ఆడాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని సింధు పేర్కొన్నారు. మ్యాచ్‌ల మధ్య విశ్రాంతి, రికవరీకి తగిన సమయం ఉంటే ఆటగాళ్లకు మరింత ప్రయోజనకరంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై మరో భారత క్రీడాకారిణి ఉన్నతి హుడా కూడా బ్యాడ్మింటన్ షెడ్యూలింగ్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు తాను ఆడిన నాలుగో కోర్టులో ‘హాక్-ఐ’ రివ్యూ కెమెరాలు లేకపోవడంపై సింధు విచారం వ్యక్తం చేశారు. క్వార్టర్‌ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌ల్లో రెండు, మూడు పాయింట్లు కూడా ఎంతో ముఖ్యమని.. అలాంటి సమయంలో రివ్యూ సిస్టమ్ అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. 2030 ఆసియా క్రీడల్లో పాల్గొనే అంశంపైనా సింధు స్పందించారు. తన శరీరం సహకరించి, గాయాల బారిన పడకుండా ఉంటే తప్పకుండా ఆడతానని స్పష్టం చేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఫిట్నెస్ను కాపాడుకోవడంతో పాటు మ్యాచ్‌లను ఎంపిక చేసుకోవడం కూడా కీలకమని తెలిపారు. బ్యాడ్మింటన్‌పై ఉన్న ప్రేమే తనను ముందుకు నడిపిస్తోందని సింధు పేర్కొన్నారు.

