కలం, నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని, రైతులకు న్యాయం జరిగే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హెచ్చరించారు.
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి దశదినకర్మకు సింగోటం వెళ్లిన ఆయన నాగర్ కర్నూల్ (Nagarkurnool) మున్సిపాలిటీ పరిధిలోని దేశిట్యాల వద్ద పత్తి, మొక్కజొన్న, మినుము పంటలను పరిశీలించారు.
పాలమూరుకు ప్రధాన శత్రువు రేవంత్ రెడ్డి: కేటీఆర్
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ .. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రధాన శత్రువు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అన్నారు. కృష్ణా, గోదావరిలో 248 టీఎంసీల నీరు పుష్కలంగా ఉన్నా వాడుకోవడం లేదన్నారు. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌లో నీళ్లున్నా, మోటార్లు ఆన్ చేయకుండా ఎల్‌నినో పేరుతో తప్పించుకుంటున్నాడని అన్నారు.
పంటలు ఎండబెట్టి నీటిని ఆంధ్రాకు తరలిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు దగ్గర పిల్లిలా ఉండి, నల్లమలలో పులిని అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 8.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, ఇప్పుడు 50 శాతం పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంట రంగు మారిపోయిందని, రైతుల కళ్లల్లో నెత్తురు కనిపిస్తోందని అన్నారు.
అధికారులు మీ పొలాల్లోకి వచ్చి సర్వే చేసి నష్టపరిహారం చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. రైతులకు అండగా ఉంటామని, రైతుల పక్షాన పోరాడుతామని హామీ ఇచ్చారు. వచ్చే ప్రభుత్వం మనదే అని, కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు తప్పక న్యాయం చేస్తాం అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
ఆయన వెంట మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి ఉన్నారు.

