కన్నతల్లి లాంటి పార్టీకి కార్యకర్తలే సైనికులు: భట్టి

​కలం, ఖమ్మం బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని, పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బూత్ లెవెల్ ఏజెంట్లే (BLA) పార్టీకి నిజమైన సైనికులు, మూలస్తంభాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో నిర్వహించిన మండల కాంగ్రెస్ బిఎల్ఏల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

చింతకాని మండలంలో బిఎల్ఏల పనితీరు అద్భుతంగా ఉందన్న భట్టి, గ్రామ స్థాయిలో కష్టపడే ప్రతి కార్యకర్త శ్రమకు తగిన గౌరవం లభిస్తుందని హామీ ఇచ్చారు. గత పదేళ్లలో మధిర నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధిని వేగవంతం చేసి, రాబోయే ఐదేళ్లలోనే 15 ఏళ్ల నాటి పనులను పూర్తి చేసి గ్రామాల్లో నాయకులు తలఎత్తుకునేలా చేస్తామని పేర్కొన్నారు.

​ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని తెలిపిన భట్టి విక్రమార్క, రాష్ట్రంలో కోటి 6 లక్షల కుటుంబాలకు ఉచిత సన్నబియ్యం పంపిణీతో ‘తెలంగాణ మోడల్’ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం, లక్ష కోట్ల డ్వాక్రా రుణాలు, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే, ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఉచిత బీమా అందించే ‘ఇందిరమ్మ భీమా’ పథకాన్ని నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

విద్యారంగంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో వేస్తున్నామని భట్టి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 27 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వేడి అల్పాహారం, పాలు, రాగిజావ అందిస్తున్నామని వివరించారు. రైతుల రుణమాఫీతో పాటు ఎకరానికి రూ. 12 వేల పెట్టుబడి సాయం అందిస్తూ పాలన సాగిస్తున్నట్లు భట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీను బాబు, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, మండల అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>